ఏపీలో ఢిల్లీ టెర్రర్.. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారు 1,470.. వారి కోసం ముమ్మర గాలింపు

కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది.  ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 04:53 AM IST
ఏపీలో ఢిల్లీ టెర్రర్.. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారు 1,470.. వారి కోసం ముమ్మర గాలింపు

కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది.  ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.

కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది.  ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది. అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్‌  ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.  దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఢిల్లీ దడ పట్టుకుంది. ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 2వేల మంది ఢిల్లీ ప్రార్థనల్లో  పాల్గొన్నారన్న విషయం నిద్ర లేకుండా చేస్తోంది.

24 గంటల్లో 21 కరోనా కేసులు:
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులు ఏపీలో కలకలం రేపారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయనుకుంటే, ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం రాష్ట్రంలో అలజడి రేపింది. మార్చి 30 రాత్రి వరకు 23 పాజిటివ్‌ కేసులతో ఉన్న రాష్ట్రం.. మంగళవారం(మార్చి 31,2020) నాటికి ఒక్కరోజు వ్యవధిలో ఆ సంఖ్య 44కు చేరింది. 

ఏపీ నుంచి 1,470 మంది ప్రార్థనల్లో పాల్గొన్నట్టు గుర్తింపు:
21 కేసుల్లో 17 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. కాగా, మర్కజ్‌ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఏటా మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ మర్కజ్‌కు వస్తుంటారు. మార్చి 14, 15వ తేదీల్లో మన రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రార్థనల కోసం వెళ్లారు. ఈ సమయంలో వివిధ దేశాల నుంచి ఆ దర్గాకు వచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్‌ అప్పటికే సోకినట్లు తెలుస్తోంది. ఆ విషయం అప్పట్లో ఎవరికీ తెలియక పోవడంతో అందరూ సన్నిహితంగా కలిసి మెలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇదే కొంపముంచింది.

ఎక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు, ఏ రైల్లో వచ్చారు:
మన రాష్ట్రానికి చెందిన పలువురు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆ విషయం తెలియకుండానే తిరిగి వారు మార్చి 17న స్వస్థలాలకు  చేరుకున్నారు. 14 రోజుల తర్వాత మహమ్మారి బారిన పడ్డారని తెలియడంతో అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో ఆందోళనతో పాటు అప్రమత్తతా పెరిగింది.  ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు జల్లెడ పడుతున్నారు. వారు ఢిల్లీ నుంచి వచ్చాక ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరితో తిరిగారు.. ఎంత మందిని కలిశారు.. ఎక్కడ బస చేశారు.. రైల్లో ఏ బోగీలో ప్రయాణించారు.. వంటి వివరాల కోసం ఆయా జిల్లాల యంత్రాంగం అణువణువూ గాలిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
ఢిల్లీ నుంచి దురంతో, ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వచ్చారు.. ప్రకాశం జిల్లాలోనే అధిక కేసులు:
చాలా మంది మార్చి 14, 15వ తేదీల్లో ఢిల్లీకి వెళ్లి 17వ తేదీ నుంచి ఏపీకి వచ్చారు. మంగళవారం(మార్చి 31,2020) ఉదయం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వారి ఇళ్ల వద్ద ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపాలిటీ యంత్రాంగం పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఎక్కువ మంది ఢిల్లీ నుంచి దురంతో, ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించారు. వీరితో పాటు ఆ రోజు ఆయా బోగీల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. రైతు బజార్లకు గానీ, ఫిష్‌ మార్కెట్లకు గానీ ఏమైనా వెళ్లారా.. ఏవైనా ఫంక్షన్‌లకు వెళ్లారా.. అన్న దానిపై ఎక్కువగా ఆరా తీస్తున్నారు. వారి ఇళ్లకు వచ్చి వెళ్లిన వారి నమూనాలనూ సేకరిస్తున్నారు. వారి ఇళ్ల చుట్టూ యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టారు. ఇరుగు పొరుగు వారిని బయటకు రావద్దని అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 535 మంది నమూనాలను సేకరించి నిర్ధారణకు పంపించారు. మంగళవారం రాష్ట్రంలో 21 పాజిటివ్‌ కేసులు నమోదైతే అందులో ప్రకాశం జిల్లాకు చెందిన వారు 8 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా 11 కేసులు నమోదైంది ఈ జిల్లాలోనే.   

స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఢిల్లీ నుంచి వచ్చిన వారికి సీఎం విజ్ఞప్తి:
ఢిల్లీ వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. వైద్యం  తీసుకుంటే ఎవరికీ ఏం కాదని, ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందని స్పష్టం చేశారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలపై  క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులు.. ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి, వైద్య  సదుపాయాలు అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మంగళవారం నమోదైన కేసుల్లో చాలా మంది ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్‌  సదస్సుకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులేనని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. జమాత్‌ నిర్వాహకులు, రైల్వే ద్వారా వారి వివరాలు  సేకరించామని చెప్పారు. సీఎం స్పందిస్తూ.. వారందరినీ క్వారంటైన్‌, ఐసోలేషన్‌కు తరలించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలున్న వారు ఎవరైనా సరే  ఆరోగ్య వివరాలను అందించాలని, లేదంటే వారి కుటుంబ సభ్యులకూ నష్టం కలుగుతుందని హెచ్చరించారు.

* ప్రపంచవ్యాప్తంగా 203 దేశాలకు పాకిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 8లక్షల 56వేల 917 కరోనా పాజిటివ్ కేసులు, 42వేల 158 మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,78,100
* ఇటీలీలో లక్ష 5వేల 792 కరోనా కేసులు.. 12,428 మరణాలు
* స్పెయిన్ లో 95వేల 923 కేసులు.. 8,464 మరణాలు
* అమెరికాలో లక్ష 87వేల 347 కేసులు, 4వేల మరణాలు
* ఫ్రాన్స్ లో 52వేల 128 కేసులు.. 3,523 మంది మరణాలు

* చైనాలో 81వేల 518 కేసులు… 3,305 మరణాలు
* ఇరాన్ లో 44వేల 605 కేసులు.. 2,898 మరణాలు
* యూకేలో 25వేల 150 కేసులు.. 1,789 మరణాలు
* నెదర్లాండ్ లో 12వేల 595 కేసులు.. 1,039 మరణాలు
* జర్మనీలో 71వేల 808 కేసులు.. 775 మరణాలు
* బెల్జియంలో 12వేల 775 కేసులు.. 705 మరణాలు
* స్విట్జర్లాండ్ లో 433 మంది, టర్కీలో 214 మంది కరోనాతో మృతి

* భారత్ లో 1,637 కు చేరిన కరోనా కేసుల సంఖ్య, 52కి చేరిన కరోనా మరణాలు
* దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 142
* మహారాష్ట్రలో 320 కరోనా కేసులు, 12 మరణాలు
* కేరళలో 241 కేసులు, రెండు మరణాలు
* తమిళనాడులో 124 కేసులు, ఒకరు మృతి
* ఢిల్లీలో 120 కేసులు, ఇద్దరు మృతి
* కర్నాటకలో 101 కేసులు, మూడు మరణాలు
* గుజరాత్ లో 74 కేసులు, ఆరు మరణాలు
* యూపీలో 108 కేసులు
* మధ్యప్రదేశ్ లో 86 కేసులు, నాలుగు మరణాలు
* జమ్ముకశ్మీర్ లో 55 కేసులు, రెండు మరణాలు
* పంజాబ్ లో 41 కేసులు, 4 మరణాలు
* బెంగాల్ లో 32 కేసులు, మూడు మరణాలు
* హరియానాలో 25 కేసులు
* బీహార్ లో 21 కేసులు, ఒకరు మృతి
* చండీగడ్ లో 13, లఢఖ్ లో 13 కేసులు, అండమాన్ లో 10,  చత్తీస్ గడ్ లో 9,  ఉత్తరాఖండ్ లో 7, గోవాలో 5, ఒడిశాలో 4 కేసులు
* రాజస్థాన్ లో 93 కేసులు
* హర్యానాలో 43 కేసులు
* హిమాచల్ ప్రదేశ్ లో 3 కేసులు, ఒకరు మృతి
* మణిపూర్, మిజోరం, ఝార్ఖండ్, అసోం, పుదుచ్చేరిలో ఒక్కో కేసు నమోదు
* ఏపీలో 58 కరోనా కేసులు
* తెలంగాణలో 97 కరోనా కేసులు, ఆరు మరణాలు, 14మంది డిశ్చార్జ్

Also Read | సమయం లేదు మిత్రమా, ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చిన వారిని గుర్తించేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌