ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంపు

  • Published By: veegamteam ,Published On : December 7, 2019 / 01:22 PM IST
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంపు

ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు 10 పైసలు.. మిగిలిన అన్ని సర్వీసుల్లో కిలో మీటర్ కు 20పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే చార్జీల పెంపు తప్పదని మంత్రి తేల్చి చెప్పారు. ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టం వస్తోందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి రూ.6వేల 735 కోట్ల అప్పు ఉందన్నారు. ఇలానే నష్టాల్లో కొనసాగితే ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితి వస్తుందన్నారు.

2015 లో డీజిల్ ధర రూ.50 ఉంటే నేడు రూ.75 కు పెరిగిందని మంత్రి అన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీ భారంగా మారాయన్నారు. 2015 తర్వాత ఇప్పటివరకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదని మంత్రి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీని బతికించుకోవడానికి చార్జీలు పెంచడం జరిగిందన్నారు. కాగా, చార్జీల పెంపుతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.

భారీ నష్టాలు, పెరుగుతున్న డీజల్‌ ధరల నేపథ్యంలో చార్జీలు పెంచాలని ఆర్టీసీ ఎప్పటి నుంచో కోరుకుంటోంది. కానీ…టీడీపీ ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. ప్రయాణికులపై భారం మోపవద్దని, ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకోవాలని సూచిస్తూ వచ్చింది. ఇక ఇటీవలే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. 50 రోజుల కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి తీవ్ర నష్టాలు వచ్చాయని చెబుతూ కేసీఆర్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచింది.

ఆర్టీసీ చార్జీలు పెంపు
* పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిమీ 10 పైసలు పెంపు
* మిగిలిన అన్ని సర్వీసుల్లో కిమీ 20పైసలు పెంపు
* ప్రతి నెల రూ.100 కోట్ల అప్పు
* ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టం
* ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు రూ.6,735 కోట్లు

* 2015 తర్వాత ఇప్పటివరకు చార్జీలు పెంచలేదు