ఊరికే ఇస్తారా : స్మార్ట్ ఫోన్ విన్నర్ మెసేజ్ తో మోసపోయిన కుర్రోడు

ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ బుక్ చేస్తే.. సోంపాపిడి ప్యాకెట్, దేవతా బొమ్మలు వచ్చాయి. కరీంనగర్ నగరంలోని రంగశాయిపేటలో ఈ ఘటన జరిగింది. జక్కలోద్ది గ్రామానికి చెందిన వంశీ.. 20 రోజుల క్రితం ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారు. రూ.1,800 చెల్లిస్తే మీ ఇంటికి పోస్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్ పంపిస్తాం అని ఆ మెసేజ్ సారాంశం. డబ్బులు కూడా పార్సిల్ వచ్చిన తర్వాతే తీసుకోండి అని చెప్పారు. స్మార్ట్ ఫోన్ కావాలంటే మీరు ఆర్డర్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ముందూ వెనక ఆలోచించని వంశీ.. వెంటనే ఆర్డర్ పెట్టేశాడు. 2019, ఫిబ్రవరి 12వ తేదీ అనుకున్నట్లుగానే పోస్టల్ ప్యాకింగ్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ వచ్చిందన్న ఆనందంలో పోస్టల్ ఆఫీసుకు వెళ్లాడు. రూ.1800 చెల్లించి బాక్స్ తీసుకున్నాడు.
స్మార్ట్ ఫోన్ చూద్దామన్న ఆనందంలో ఓపెన్ చేసి చూశాడు. షాక్. స్మార్ట్ ఫోన్ బదులు సోం పాపిడి ప్యాకెట్, పూజా సామగ్రికి సంబంధించి లక్ష్మిదేవి బొమ్మ, పాదుకలు, తాబేలు, లాకెట్ బ్రాస్ ఉన్నాయి. మోసపోయానని గుర్తించి హెడ్ పోస్టాఫీస్ సూపరింటెండెంట్‌ను కలిశాడు. ఆయన సంబంధిత గ్లోబల్ ఇండియా మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధుల సెల్ నంబర్‌కు(9611693363) ఫోన్ చేశారు. కంపెనీవారు పొరపాటు జరిగినట్లు చెప్పారని సూపరింటెండెంట్ వివరించారు. అంతే కాకుండా ‘ www.india.post.gov.enccc computers’ లో ఫిర్యాదు చేయాలని వివరించారు. కాగా పార్శిల్ ద్వారా వచ్చిన వస్తువుల మొత్తం విలువ రూ.100 కూడా ఉండదు అంటున్నాడు వంశీ. మోసం జరిగింది సరే.. ఏ డ్రాలో స్మార్ట్ ఫోన్ గెలిచాను.. రూ.1,800కే స్మార్ట్ ఫోన్ ఎలా వస్తుందనేది మాత్రం ఆలోచించటం పోవటం విశేషం…