25వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు..చనిపోయిన అన్నదాతలకు నివాళులు

25వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు..చనిపోయిన అన్నదాతలకు నివాళులు

protest of farmers reaching the 25th day : కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. రోజురోజుకు అన్నదాత ఉద్యమం ఉధృతమవుతోంది. అటు కేంద్రం, ఇటు రైతులు పట్టువీడటం లేదు. ఎవరికి వారే పట్టుదలకు పోతున్నారు. రైతులు ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్‌ పడే పరిస్థితులు కనిపించడం లేదు.

నవంబర్‌ 26న రైతుల ఆందోళన మొదలైంది. రైతు ఉద్యమం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 33 మంది రైతులు చనిపోయారు. చలి, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలతోపాటు పలు కారణాలతో వీరంతా చనిపోయారని రైతు సంఘాలు వెల్లడించాయి. వీరందరికి ఇవాళ శ్రద్ధాంజలి ఘటించాలని నిర్ణయించాయి. ఆందోళనలు జరుగుతున్న అన్నిచోట్ల చనిపోయిన రైతులకు నివాళులు అర్పించనున్నారు. మౌనదీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. రైతుల త్యాగాలను స్మరించుకుంటూ… దేశ వ్యాప్తంగా లక్షకుపైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య నిలిచిపోయిన చర్చలపై హర్యానా సీఎం మనోహర్‌లాల ఖట్టర్‌ కీలక ప్రకటన చేశారు. రైతులతో చర్చల పునరుద్ధరణకు మార్గాన్ని అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో రైతులతో భేటీ జరిగే అవకాశముందని ప్రకటించారు. శనివారం ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో సమావేశమై… రైతుల ఆందోళనలపై చర్చించారు. రైతు నేతలు చట్టాలను రద్దు చేయాలనే వైఖరి నుంచి బయటకి వస్తే… సత్వరమే చర్చలకు మార్గం సుగమం అవుతుందని మెలిక పెట్టారు. అలా అయితేనే చట్టాల్లో మార్పులు చేయడంపై ప్రభుత్వం ఆలోచించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

రైతులు కూడా తమ భవిష్యత్‌ వ్యూహాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వ పెద్దల నుంచి చర్చలకు ఆహ్వానాలు అందుతుండం, మరోవైపు సుప్రీంకోర్టు చర్చల కోసం కమిటీని ప్రతిపాదించడంతో.. ఏం చేయాలన్నదానిపై రైతులు తర్జన భర్జన పడుతున్నారు. సుప్రీం కమిటీ ప్రపోజల్స్‌పై న్యాయవాదుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సుప్రీం కమిటీలో భాగం కావాలా… వద్దా.. అనే విషయంపై రైతు సంఘాల నేతలంతా అంతర్గంతా చర్చలు జరుపుతున్నారు. కమిటీలో చేరితే.. ప్రభుత్వ వైఖరిని ఒప్పుకున్నట్టేనని, అందుకే చట్టాల రద్దు జరిగేదాకా ఎలాంటి కమిటీల్లోనూ చేరొద్దని కొందరు నేతలు వాదించినట్టుగా తెలుస్తోంది. దీనిపైనే అంతర్గంతా రైతు సంఘాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. దీనిపై రెండు, మూడు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశముంది.

రైతులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రావాలని ప్రధాని మోదీ స్వయంగా శుక్రవారం రైతులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రైతు సంఘాలు ప్రధాని విజ్ఞప్తిపై చర్చించాయి. చట్టాల రద్దుకు కేంద్రం తిరస్కరిస్తుండడంతో.. ఉద్యమాన్ని విరమించేదే లేదని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. ఎన్ని రోజులైనా సాగించాలని డిసైడ్‌ అయ్యారు.

ఇక ప్రధాని, రైతులు పరస్పరం లేఖలు సంధించుకున్నారు. కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ హిందీలో రైతు సంఘాలకు రాసిన 8 పేజీల లేఖను 9 ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసి… ప్రధాని తన ట్విట్టర్‌ ఖాతా దారా షేర్‌ చేశారు. దీనిపైనా రైతు నేతలు మండిపడుతున్నారు. ఇక విపక్షాలు రెచ్చగొట్టడం వ్లలే రైతులు ఆందోళనలకు దిగారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలనూ వారు ఖండిస్తున్నారు. తమ డిమాండ్ల వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేస్తూ.. ప్రధాని మోదీకి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌కు రైతు సంఘాల నేతలు ఉమ్మడి లేఖను రాశారు. తమ డిమాండ్స్‌ స్వచ్చందంగా చేస్తున్నవి తప్ప.. రాజకీయ పార్టీల ప్రేరేపితంతో చేస్తున్నవి కావన్నారు.