నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్

నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్

Japanese work week : జపాన్‌లో నాలుగు రోజులు వర్కింగ్‌ డే పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటికే అక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసిన మూడు రోజుల వారాంత సెలవుల విధానం విజయవంతం కావడంతో దీన్ని అమలు చేయాలంటోంది అక్కడి ప్రభుత్వం. దీనిపై చట్టం తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమయపాలన, కష్టపడి పనిచేయడంలో జపాన్‌ పెట్టింది పేరు. అక్కడి ఉద్యోగులంతా సమయానికి ఆఫీసుకు వచ్చి పనిలో నిమగ్నమవుతుంటారు.

ఉద్యోగుల్లోని అభద్రతా భావం కూడా ఇందుకు ఒక కారణం. దీంతో వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొవడంతోపాటు కుటుంబం కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం మూడు రోజుల వారాంతపు సెలవుల విధానాన్ని తీసుకురావాలి అనుకుంటుంది. కరోనా ప్రభావంపై పోరాడటంలో ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు అక్కడి నిపుణులు. కొవిడ్‌-19 సోకే ప్రమాదం తక్కువగా ఉండటంతోపాటు ట్రాన్స్‌పోర్టింగ్ వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు నేతలు.

అలాగే.. సెలవు రోజుల్లో ఇతర పనులు చేసుకుంటూ మరో ఆదాయం పొందడం, ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే, ఈ విధానం వల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు పెరగవచ్చు. వారానికి ఐదు రోజులకు బదులు నాలుగు రోజులే పనిచేస్తారు కాబట్టి 20శాతం మేర జీతంలో కోతకు అవకాశం ఉంది. ఆ బిల్లు తీసుకొస్తే ఉద్యోగులు వారంలో వారిని నచ్చిన మూడు రోజులు సెలవులు తీసుకునే వీలు కల్పిస్తుందంటున్నారు నేతలు.

ఉద్యోగుల కోసం పనివేళలను.. పని వాతావరణాన్ని నచ్చిన విధంగా మార్చగలమని నమ్ముతున్నారు నేతలు. జపాన్‌లోని మైక్రోసాఫ్ట్‌.. తమ ఆఫీసులో ఉద్యోగులకు 2019 ఆగస్టు నెలలో మూడు రోజుల వారాంత సెలవులను ప్రయోగత్మకంగా అమలు చేసింది. ది వర్క్‌ లైఫ్‌ ఛాయిస్‌ ఛాలెంజ్‌ సమ్మర్‌-2019 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ జపాన్‌ అద్భుత విజయం సాధించింది. మరి ఈ మూడు రోజుల వారాంత సెలవులు అమల్లోకి ఎప్పుడు వస్తాయో చూడాలి.