IPL 2024 : చెలరేగిన మార్కస్ స్టోయినీస్.. ముంబైపై 4 వికెట్ల తేడాతో లక్నో విజయం

IPL 2024 LSG vs MI : 145 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 19.2 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 145 పరుగులతో విజయం సాధించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో ఆరో విజయాన్ని అందుకుంది. 

IPL 2024 : చెలరేగిన మార్కస్ స్టోయినీస్.. ముంబైపై 4 వికెట్ల తేడాతో లక్నో విజయం

LSG Vs MI, IPL 2024 : (Image Source : Google/IPL_Twiiter)

IPL 2024 LSG vs MI : ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ సొంత మైదానంలో అదరగొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలిచింది. ముంబై నిర్దేశించిన 145 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 19.2 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 145 పరుగులతో విజయం సాధించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో ఆరో విజయాన్ని అందుకుంది.

లక్నో బ్యాట్స్‌మన్ మార్కస్ స్టోయినీస్ ( 62; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీతో జట్టు స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 14.5 ఓవర్‌లో మహ్మద్ నబీ బౌలింగ్‌లో షాట్ ఆడిన స్టోయినీస్ తిలక్ వర్మకు చేతికి బంతి చిక్కడంతో క్రీజు నుంచి నిష్ర్కమించక తప్పలేదు.

మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (28) పరుగులతో రాణించగా, దీపక్ హుడా (18), నికోలస్ పూరన్ (14), అష్టన్ టర్నర్ (5), ఆయుష్ బదోని (6), కృనాల్ పాండ్యా (1 నాటౌట్) పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసుకోగా, నువాన్ తుషార, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్క్ స్టోయినీస్ (62/45, 1/19) స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

నేహాల్ వధేరా టాప్ స్కోరు :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దాంతో ఆతిథ్య జట్టు లక్నోకు 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఆటగాళ్లలో నేహాల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35), ఇషాన్ కిషాన్ (32) పరుగులతో రాణించారు.

సూర్యకుమార్ యాదవ్ (10), రోహిత్ శర్మ (4), తిలక్ వర్మ (7), మహమ్మద్ నబీ (1), గెరాల్డ్ కోయెట్జీ (1) పేలవ ప్రదర్శనతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాటపట్టారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా, మార్కస్ స్టోయినీస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.

12 పాయింట్లతో టాప్ 3లో లక్నో :
పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 4 ఓడి 12 పాయింట్లతో టాప్ 3లో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 7 ఓడి 6 పాయింట్లతో పట్టికలో దిగువన 9వ స్థానానికి పడిపోయింది.

Read Also : IPL 2024 Playoffs : బీసీసీఐకి ఈసీబీ షాక్‌.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల‌కు ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాళ్లు దూరం..