Khairatabad Ganesh Shobhayatra : ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా ట్యాంక్‌బండ్‌కు.. నిమజ్జనం ఎప్పుడంటే.. Live
Khairatabad Ganesh Shobhayatra : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.

Khairatabad Ganesh Shobhayatra
Khairatabad Ganesh Shobhayatra : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీవిశ్వశాంతి మహాశక్తి గణపతి మహా నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం అర్థరాత్రి వరకే దర్శనాలు నిలిపివేసిన నిర్వాహకులు.. శుక్రవారం అర్థరాత్రి 12గంటలు దాటిన తరువాత పూజారులు అనంత చతుర్ధశిలో కలశాన్ని కదిలించారు. శనివారం ఉదయం మహాగణపతిని వాహనంపైకి ఎక్కించారు. వాస్తవానికి ఉదయం 6గంటలకే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కాస్త ఆలస్యంగా శోభాయాత్రను ప్రారంభించారు.
విశ్వశాంతి మహాశక్తి గణపతికి రెండు వైపులా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. కుడివైపు పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, ఎడమవైపున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలు ఉన్నాయి. ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపై ఉంచి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 20 క్రేన్లను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అందులో ఒకటి బాహుబలి క్రేన్. ఎన్టీఆర్ మార్గ్ లో నాలుగో నెంబర్ స్టాండులో ఉంటుంది. అక్కడే ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేస్తారు.
50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తు ఉన్న మహాగణపతిని సాగర తీరానికి తీసుకెళ్లేందుకు ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టుకు చెందిన భారీ ట్రాయిలర్ వాహనంను వినియోగించారు. 75 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పు, 26 టైర్లు ఉన్న వాహనం బరువు 28 టన్నులు. ఈ వాహనం 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఈ రూట్లలో శోభాయాత్ర..
ఖైరతాబాద్ నుంచి మొదలైన శోభాయాత్ర రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి ప్లైఓవర్, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేయిన్ నంబర్ 4కు మహాగణపతి చేరుకుంటారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
హుస్సేన్‌సాగర్ వద్ద సామూహిక నిమజ్జనాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులు సొంత వాహనాల్లో కాకుండా సిటీ బస్సులు, మెట్రో రైల్, ఎంఎంటీఎస్ వంటి ప్రజారవాణా వ్యవస్థల్ని వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. బాలాపూర్ నుంచి చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ మార్గంలో ఇటు నుంచి అటు వెళ్లడానికి కేవలం రాజేష్ మెడికల్‌హాల్, బషీర్‌బాగ్ చౌరస్తాల వద్దే అవకాశం ఉంది. విమానాశ్రయానికి వెళ్లాల్సినవాళ్లు ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
పార్కింగ్ ప్రదేశాలు : ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శ నగర్, బీఆర్ కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.