ఆసియాలోనే అత్యాధునికం : కరీంనగర్ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 12:52 PM IST
ఆసియాలోనే అత్యాధునికం : కరీంనగర్ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి

ఆసియాలోనే అత్యాధునిక సస్పెన్షన్ బ్రిడ్జిని కరీంనగర్‌ జిల్లాలో నిర్మిస్తున్నారు. విదేశీ టెక్నాలజీని జోడించి అత్యంత హంగులు సమకూర్చి ఈ బ్రిడ్జ్‌ని నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ బ్రిడ్జి కోసం సీఎం కేసీఆర్‌ 180 కోట్లు మంజూరు చేసి ఎప్పటికప్పుడు పనుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఈ కేబుల్ వంతెన పనులు జోరందుకున్నాయి. కొద్దినెలల్లోనే అది అందుబాటులోకి రానుంది. ఐదు ముఖద్వారాలున్న ఈ పట్టణానికి.. ఆరో ముఖ ద్వారంగా నిర్మాణం జరుగుతోంది కేబుల్ బ్రిడ్జ్‌.

కరీంనగర్‌-వరంగల్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న ఈ వంతెన ప్రస్తుతం ఉన్న దూరంలో ఏడు కిలోమీటర్లు తగ్గిస్తుంది. కరీంనగర్ నడి ఒడ్డు కమాన్ నుంచి సదాశివపల్లె వరకు ఉన్న రోడ్డును పునరుద్దరించేందుకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన ప్రతిపాదనలకు.. సీఎం కేసీఆర్ అంగీకరించారు. ఈమేరకు మానేరు వాగుపై 2017వ సంవత్సరంలో కేబుల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే పనులు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు ప్రధాన పిల్లర్స్‌లో ఒకదాని నిర్మాణం పూర్తికాగా .. మరో పిల్లర్ నిర్మాణం జరుగుతోంది. వీటితో పాటు బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన అన్ని పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. 

కేబుల్ బ్రిడ్జి పూర్తయితే వరంగల్-కరీంనగర్ రహదారిలో ట్రాఫిక్‌ కష్టాలు తొలగడంతో పాటు దూరం తగ్గుతుంది. మరోవైపు బ్రిడ్జికి అనుసంధానంగా ప్లై ఓవర్.. కమాన్ నుంచి కేబుల్ వంతెన వరకు చేపట్టిన రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మురుగుకాల్వల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరోవైపు బ్రిడ్జ్‌పై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు .. మరో 40 కోట్ల రూపాలయను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇది పూర్తైతే కరీంనగర్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా .. నగరం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంటున్నారు.  

వెయ్యిటన్నుల కెపాసిటీతో నిర్మిస్తున్న ఈబ్రిడ్జిపై ఎంతటి బరువైన వాహనాలైనా సులువుగా వెళ్లేలా నిర్మాణం చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఇలాంటివి రెండు మాత్రమే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఇదే మొదటిది. కరీంనగర్ ప్రజల కలల వారధిగా ఉన్న ఈ కేబుల్ వంతెన ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా.. అని నగరవాసులు ఎదరుచూస్తున్నారు.

Also Read : ప్రపంచంలో మూడో అతిపెద్దది : అత్యాధునిక టెక్నాలజీతో బాహుబలి థియేటర్