వైసీపీ వందరోజుల పాలన : వింటున్నారు..చూస్తున్నారు…చేస్తున్నారు

ఏపీలో వైసీపీ అధికారంలోకి నేటికి 100 రోజులైంది. ఈ వందరోజుల పాలనలో సీఎంగా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : September 6, 2019 / 01:33 AM IST
వైసీపీ వందరోజుల పాలన : వింటున్నారు..చూస్తున్నారు…చేస్తున్నారు

ఏపీలో వైసీపీ అధికారంలోకి నేటికి 100 రోజులైంది. ఈ వందరోజుల పాలనలో సీఎంగా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి నేటికి 100 రోజులైంది. ఈ వందరోజుల పాలనలో సీఎంగా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని సంచలనంగా మారితే.. కొన్ని వివాదాస్పదంగా మారాయి. కొన్నింటికి ప్రశంసలు దక్కితే.. మరికొన్నింటిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకీ జగన్‌ వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలేంటి..? ఆయనపై వచ్చిన విమర్శలేంటి..? ఏపీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో చరిత్ర సృష్టించారు జగన్. 175 సీట్లలో పోటీ చేసి 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని స్థాపించారు. మే 30 తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ 25 మంత్రులతో ఫుల్ క్యాబినేట్ ఏర్పాటు చేసి పాలన ప్రారభించారు. అప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్నారు. 

ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎల్పీ మీటింగ్ నుంచే కీలక నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు సీఎం జగన్. ఎమ్మెల్యేలు ఎవరూ అవినీతి చేయకూడదని.. అవినీతికి పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక మంత్రివర్గ కూర్పులోనూ తనదైన మార్క్ చూపించారు జగన్. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలకు అవకాశం ఇచ్చారు. ఇక జగన్ క్యాబినెట్‌లో ఎక్కువమంది మొదటిసారి మంత్రులు అయినవారే ఉన్నారు. భారీ మెజారిటీ రావడంతో మంత్రి పదవులపై పార్టీలో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. మంత్రులకు రెండున్నరేళ్ల కాలం మాత్రమే పనిచేసే అవకాశం ఉందని ముందే చెప్పేశారు జగన్. 

తండ్రి బాటలోనే సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు జగన్‌. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాలకి పెద్ద పీట వేశారు. అమ్మఒడి పథకాన్ని వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ప్రారంభించనున్నారు. పిల్లల్ని చదివించే తల్లికి ఏడాదికి 15 వేలు ఇవ్వనున్నారు. ఇక రైతుభరోసా పథకం ద్వారా 12 వేల 500 రూపాయలను అక్టోబర్ 15 నుంచి ఇవ్వనున్నారు. ఈ నెల నుంచే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు 2 వేల 250 రూపాయల పింఛన్ల ఫైల్‌పై మొదటి సంతకం పెట్టి అమలు చేస్తున్నారు. 4 లక్షల మందితో గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ పథకాలను ఇంటి గుమ్మంలోకి తీసుకొచ్చే వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఆగస్ట్ 15 తేదీ నుంచి ప్రారంభమైన ఈ వ్యవస్థ ఇకపై ప్రతి పథకాన్ని ఇంటింటికీ చేరవేయనుంది. దీంతోపాటు గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక సచివాలయం ఉండేలా ప్లాన్ చేశారు. వీటిలో 10 ఉద్యోగాలు చొప్పున మొత్తం లక్షా 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

ఇక తాను నిర్వహించిన మొదటి కలెక్టర్ల సమావేశంలోనే అధికారులకు తన పాలన ఎలా ఉండబోతోందో ఒక క్లారిటీ ఇచ్చేశారు జగన్. అధికారులెవరూ అవినీతి విషయంలో ప్రజాప్రతినిధులకు సహకరించవద్దు అని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతల సమస్య రాకూడదని స్పష్టమైన అదేశాలిచ్చారు. ప్రతి వారం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు నిత్యం ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని సూచించారు.

పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేసే దిశగా  నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. వీటిలో అంగన్‌వాడి, ఆశావర్కర్లకి జీతాలు పెంచారు.  ఉద్యోగుల సీపీఎస్ రద్దుకు ప్రత్యేక కమిటీ వేశారు. కమిటీ నివేదిక రాగానే సీపీఎస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఆర్టీసీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకరించిన సీఎం.. మూడు నెలల్లోనే ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం కమిటీని నియమించారు. పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచారు. 

ఇక గత ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందని భావిస్తున్న ప్రాజెక్టులపై విచారణ చేయిస్తున్నారు జగన్‌. నిపుణుల కమిటీతో పాటు కేబినెట్ సబ్కమిటీ వేసి 30 అంశాలపై విచారణ జరిపించారు. వీటి ఆధారంగా పోలవరం, రాజధాని విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళుతోంది ప్రభుత్వం. టెండరింగ్ విధానంలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని.. వాటిని సరిదిద్దేందుకే రివర్స్ టెండరింగ్ విధానం అంటూ 25 శాతం కంటే తక్కువ అయిన పనుల్లో రివర్స్ టెండరింగ్‌ వెళ్లాలని ఆదేశాళిచ్చారు జగన్‌. పోలవరం విషయంలోనూ కాంట్రాక్టు సంస్థను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. ఇక రాజధాని విషయంలోనూ నిర్మాణంలోనున్న ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్‌కి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రివర్స్ టెండరింగ్ పక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేందుకు జ్యుడీషియల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ టెండరింగ్ చేపడుతోంది ప్రభుత్వం. వంద కోట్లు దాటిన ఏ టెండర్ అయినా జ్యూడిషియల్ కమిటీ పరిధిలోకి వచ్చేలా విధివిధానాలు రూపొందించింది.

ఇక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన 19 బిల్లుల్నీ తీసుకొచ్చారు సీఎం జగన్. సామాజిక న్యాయంలో భాగంగా ప్రతీ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయిస్తూ చట్టం తీసుకొచ్చారు. వీటిని ప్రభుత్వం నుంచి వచ్చే నామినేటెడ్ వర్క్స్‌లోనూ అమలు చేయనున్నారు. వీటితోపాటు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్లోనూ ఈ 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ప్రైవేటు స్కూల్స్ ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టం తీసుకువచ్చారు. అసెంబ్లీ వేదికగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. ఎవరైనా పార్టీ మారితే వారిని అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఇలా పాలన విషయంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న సీఎం జగన్‌కి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ వంద రోజుల్లో ఎదురయ్యాయి. ముఖ్యంగా ఇసుక పాలసీ ప్రకటించిన ప్రభుత్వం దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంది. రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగం పూర్తిగా నష్టపోయింది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఇసుక కొరత విషయంలో ప్రతిపక్షాలనుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ప్రజావేదిక అక్రమ కట్టడాల విషయంలో కూడా ప్రభుత్వానికి కాస్త ఇబ్బందులు వచ్చాయి.  అక్రమ కట్టడాలు విషయంలో కఠినంగా ఉంటామంటూ ప్రజావేదికను కూల్చి మిగిలినవాటి విషయంలో సైలెంట్‌గా ఉండటం విమర్శలకు తావిచ్చింది. వరద సహాయక చర్యలు విషయంలోనూ ఆలస్యంగా స్పందించారనే విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నివాసంపై ఫోకస్ పెట్టారని ప్రచారం కూడా జరిగింది. తాజాగా రాజధాని విషయంలో మరింత విమర్శలు వచ్చాయి. రాజధాని ఇక్కడ సరికాదంటూ మంత్రులు చేసిన కామెంట్స్, దానికి ప్రతిపక్షాల విమర్శలు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కాస్త నెగిటివ్ వేవ్ తెచ్చాయి. మొత్తానికి జగన్ వంద రోజుల పాలనలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయలు మంచివే అయినా వాటిని అమలు చేయడంలో కాస్త తడబడ్డారనే విమర్శలు వస్తున్నాయి.

Also Read : సంక్షేమ మాసం : ఏపీ ప్రజలకు ప్రతి నెలా పండుగే