ఆపరేషన్ చిరుత.. 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ, నేడు ప్లాన్-బి అమలు

ఓ చిరుత పులి, అది కూడా గాయపడిన చిరుత పులి.. మూడు శాఖల అధికారులకు చుక్కలు చూపిస్తోంది.

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 03:48 AM IST
ఆపరేషన్ చిరుత.. 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ, నేడు ప్లాన్-బి అమలు

ఓ చిరుత పులి, అది కూడా గాయపడిన చిరుత పులి.. మూడు శాఖల అధికారులకు చుక్కలు చూపిస్తోంది.

ఓ చిరుత పులి, అది కూడా గాయపడిన చిరుత పులి.. మూడు శాఖల అధికారులకు చుక్కలు చూపిస్తోంది. పోలీస్, అటవీ, జూ పార్క్ సిబ్బందికి చెమట్లు పట్టిస్తోంది. ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 24 గంటలుగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా చిరుత జాడ మాత్రం దొరకడం లేదు. పట్టుకోండి చూద్దాం అంటూ చిరుత పులి సవాల్ విసురుతోంది.

చెట్ల పొదల్లో నక్కిన చిరుతను బయటకు రప్పించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రాత్రంతా ఆపరేషన్ చిరుత కొనసాగింది. అయినా ప్రయోజనం లేదు. చిరుతను పట్టుకునేందుకు మూడు శాఖల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిరుత నక్కిన ఫామ్ హౌస్ మొత్తం దట్టమైన చెట్లు ఉంటాయి. దీంతో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 25 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత కదలికలపై నిఘా పెట్టారు. మైలార్ దేవ్ పల్లిలో రెండో రోజు కూడా ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది.

కుక్కలు, మేకలను ఎరగా వేసినా ఫలితం లేదు:
అంతేకాదు 10 కుక్కులు, 2 మేకలను ఎరగా వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చిరుతను ఎలాగైనా పట్టుకుని తీరుతామని అధికారులు అంటున్నారు. మొత్తంగా ఆపరేషన్ చిరుత డే 2 కూడా కంటిన్యూ అవుతోంది. కాగా, కాటేదాన్, బుద్వేల్ వాసులు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. స్థానికంగా ఉన్న తోటలో చిరుత నక్కినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతను బంధించేందుకు ఇవాళ(మే 15,2020) ప్లాన్ బి అమలు చేయనున్నారు.

అరణ్యం నుంచి జనారణ్యంలోకి:
గురువారం(మే 14,2020) ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై స్థానికులు చిరుతపులిని గుర్తించారు. ఎన్‌హెచ్‌-7 ప్రధాన రహదారిపై గాయపడిన చిరుత కనిపించింది. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై రాకపోకలను నియంత్రించారు. వెంటనే అటవీశాఖ అధికారులు, జూ పార్క్‌ రెస్క్యూ టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది తప్పించుకుంది. పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయింది. చిరుత ఎడమ కాలికి గాయమైంది. దీంతో అది వేగంగా పరిగెత్తలేకపోతోంది. గాయపడినా దొరక్కుండా అందరికి చుక్కలు చూపిస్తోంది. ఓవైపు కరోనా మహమ్మారితో వణికిపోతున్న నగర శివారు ప్రజలకు.. తాజాగా చిరుత భయంపట్టుకుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Read Here>> హైదరాబాద్ శివార్లలో చిరుత భయం, మరోసారి తప్పించుకుంది