తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేశ్ క్లారిటీ.. హామీకి కట్టుబడతామని ప్రకటన

బడికి వెళుతున్న పిల్లలందరికీ నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలన్న బేధం లేకుండా విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తామన్నారు.

తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేశ్ క్లారిటీ.. హామీకి కట్టుబడతామని ప్రకటన

Minister Nara Lokesh Clarity on Thalliki Vandanam Scheme 2024

Nara Lokesh Clarity on Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఎంత పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం నిధులు ఇస్తామని ఎన్నికల్లో హామీయిచ్చామని, దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. బడికి వెళుతున్న పిల్లలందరికీ నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలన్న బేధం లేకుండా విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తామన్నారు. గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగామని, గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 3 తరగతి నుంచి అమలు చేస్తున్న టోఫెల్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని పలు సూచనలు వచ్చాయని, దానిపై కూడా సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు. ”ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించడం లేదు. నాలాగా మాతృభాషలో మాట్లాడటానికి ఎవరూ ఇబ్బంది పడకూడదు. నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడటానికి తడబడుతున్నాన”ని మంత్రి లోకేశ్ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు డౌన్
2019 నుంచి 2024 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 72 వేల మంది విద్యార్థులు తగ్గారని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలల కోసం వేలాది కోట్ల రూపాయలు నిధులు ఖర్చుపెట్టినా ఎందుకు విద్యార్థులు తగ్గారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్షంగా సీబీఎస్ విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. అందరితో చర్చించి రోడ్ మ్యాప్ రూపొందించిన తర్వాతే తాము ముందుకెళతామన్నారు.

Also Read: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గాయని, 13 వేల పాఠశాలల్లో 10 కన్నా తక్కువ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారనో పరిశీంచి మన రాష్ట్రానికి అవసరమయ్యే మోడల్ రూపొందిస్తామన్నారు. దీనిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత అమలు చేస్తామని మంత్రి లోకేశ్ వివరించారు.