కేసీఆర్‌ను రమ్మనండి..! ఢిల్లీలో దీక్షకు సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి

మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాటపడుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు.

కేసీఆర్‌ను రమ్మనండి..! ఢిల్లీలో దీక్షకు సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపుల వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. సభలో వాడీవేడిగా చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం నడిచింది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రతిపాదించగా.. అందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో దీక్ష చేసేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, కేసీఆర్ ను రమ్మని చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. సభా నాయకుడిగా తాను, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కలిసి ఢిల్లీలో దీక్ష చేద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలు వచ్చుడో, సచ్చుడో.. కేంద్రంతో తేల్చుకుందాం.. అని సీఎం రేవంత్ అన్నారు.

”తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా.. అక్కడ కేటీఆర్, ఇక్కడ హరీశ్ రావు దీక్ష గురించి ప్రతిపాదించారు. కేసీఆర్ ను రమ్మనండి.. కేసీఆర్, నేను.. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, సభా పక్ష నాయకుడిగా నేను.. తెలంగాణకు నిధులు తెచ్చుడో, అవసరమైతే చచ్చుడో తేలుద్దాం.. మేము సిద్ధం.. తప్పకుండా జంతర్ మంతర్ లో దీక్ష చేద్దాం.. తేదీ మీరే చెప్పండి.. కేసీఆర్ ను తీసుకురండి..” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాటపడుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు. 24 గంటలు తిరగక ముందే నిమ్మరసం తాగి నిమ్స్ హాస్పిటల్ లో సెలైన్ ఎక్కించుకుని, దీక్షలు చేసి చావు నోట్లో తల పెట్టామని మేము ఎప్పుడూ అబద్దాలు చెప్పలేదు. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాం కానీ, 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా ఓ శ్రీకాంతా చారిని, ఓ యాదయ్యను బలిగొనలేదు. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో, ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని.. మళ్లీ ఇతరుల ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు” అని బీఆర్ఎస్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Also Read : ఆ 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు అంటూ ప్రచారం..! అసలు బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ ఏంటి?

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అఖిలపక్షాన్ని తీసుకెళితే ఢిల్లీకి వచ్చేందుకు, దీక్ష చేసేందుకు తాము సిద్ధం అన్నారు హరీశ్ రావు. ” కేటీఆర్ చెప్పారు. నేను మళ్లీ చెబుతున్నా. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవం. మీరు రెజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళితే మీ వెంట రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీలో ధర్నా చేద్దాం అంటే.. మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నా. రుణమాఫీ గురించి హరీశ్ రావు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరి అన్నీ మేమే చేస్తే మీరేం చేస్తారు?” అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీశ్ రావు.