Mango Harvest : మామిడిలో పూత, పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్దతులు!

మసి తెగులు తేనె మంచు పురుగు, పిండినల్లి విసర్జించే తేనెలాంటి జిగిరు పదార్థం మీద వృద్ధి చెందుతుంది. మసి తెగులు ఆశించిన ఆకులపై, పూ గుచ్ఛంపై, కాయలపై, పండుపై మసి పూసినట్లుగా నల్లటి పొర ఏర్పడుతుంది.

Mango Harvest : మామిడిలో పూత, పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్దతులు!

Proprietary methods to be undertaken at the coating and pulping stage of mangoes!

Mango Harvest : ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో చాలా చోట్ల మామిడి పూత ఆలస్యంగా వస్తూ దిగుబడులు తగ్గుతున్నాయి. దిగుబడులు తగ్గకుండా, మామిడి రైతులు కోత తర్వాత సరైన యాజమాన్యం పాటించడం ద్వారా వచ్చే ఏడాది సక్రమంగా పూత రావడంతో పాటు అధికదిగుబడులు పొందవచ్చు. మామిడిలో పూత సాధారణంగా డిసెంబర్ నెల ఆఖరి వారంలో వస్తుంది.పూర్తి స్ధాయిలో పూత రావడానికి జనవరి మాసం ఆఖరి వరకు సమయం పడుతుంది.

ఒక పూకొమ్మలో పుష్పాలు వేల సంఖ్యలో వచ్చినా చివరకు 5 నుండి 6 పిందెలు కడతాయి. ఈ 5 నుండి 6 పిందెలలో చివరికి ఒకటి నుంచి రెండు పిందెలు మాత్రమే ఎదిగి కాయలుగా మారుతాయి. పిందె దశలో ఎక్కువగా రాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మామిడి పిందెలు బఠాణి సైజు, నిమ్మకాయ సైజుల మధ్య ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడినివ్వాలి.

మామిడిలో పూత రాలటం సహజం, మొగ్గ పుష్పాలు, ఫలదీకరణ చెందని పుష్పాలు రాలిపోతాయి. అధిక ఉష్ణోగ్రత, బూడిద తెగుళ్ళు, తేనెమంచు, నీటి ఎద్దడి, అధిక తేమ, హార్మోన్ల లోపం వలన పిందె కాయ రాలిపోతుంది. మామిడిలో మొగ్గ దశ నుండి పిందె దశలో అధిక నష్టం కలిగించే చీడపీడలలో తేనెమంచు పురుగు, మసి మంగు, పక్షికన్ను మచ్చ తెగులు మరియు బూడిద తెగులు వంటివి ఆశిస్తాయి.

తెగుళ్ల  నివారణ ;

తేనెమంచు పురుగు: పూత, కాత దశల్లో తేనె మంచు పురుగు నష్టం కలిగిస్తుంది. పూత నుండి రసం పీల్చడంవల్ల పూత రాలిపోతుంది. ఈ పురుగులు విసర్జించిన తేనెవంటి జిగురుపై మసి తెగులు వృద్ధి చెందుతుంది. దీని నివారణకు లీటరు నీటికి ఫాస్పామిడాన్ 0.5 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. కలిపి పూత మొదలయ్యే సమయం మరియు పిందెలు తయారయ్యే సమయం పూత, ఆకులపైనే కాకుండా మొదళ్ళ పైన, కొమ్మలపైన కూడా పిచికారి చేయాలి. పూలు పూర్తిగా విచ్చుకోకముందే పిచికారి చేయాలి.

పక్షికన్ను మచ్చ తెగులు: మామిడిని ఆశించు తెగుళ్ళలో ఈ తెగులు అధిక నష్టం కలుగజేసేదిగా చెప్పవచ్చు. ఇది ఆశించినప్పుడు గోధుమ రంగు మచ్చలు ఆకులు, పండ్లు, పూరెమ్మల మీద ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తెగులు ఉధృతంగా ఉంటే పూరెమ్మలు, పిందెలు రాలిపోయి, పూగుచ్ఛమంతా మగ్గిపోతుంది. దీంతో కాపు ఉండదు. ఈ తెగులు ఆశించిన పండ్లు కుళ్ళిపోయి, చిన్న కొమ్మలు ఎండిపోతాయి. మబ్బులు, గాలిలో తేమ ఎక్కువైనప్పుడు దీని ఉధృతి అధికంగా ఉంటుంది. దీనిని నివారించేందుకు పూత సమయంలో అయితే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజిమ్ మొదటిసారి, 2.5 గ్రా. మాంకోజెబ్ రెండవ సారి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

మసి మంగు: మసి తెగులు తేనె మంచు పురుగు, పిండినల్లి విసర్జించే తేనెలాంటి జిగిరు పదార్థం మీద వృద్ధి చెందుతుంది. మసి తెగులు ఆశించిన ఆకులపై, పూ గుచ్ఛంపై, కాయలపై, పండుపై మసి పూసినట్లుగా నల్లటి పొర ఏర్పడుతుంది. ఆకులపై ఏర్పడ్డ మసి లాంటి పొర కారణంగా కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. దీని కారణంగా పూగుత్తి సక్రమంగా వికశించదు, కాయ ఎదుగుదల తగ్గి నాణ్యత కోల్పోతుంది. దీనిని నివారించుకునేందుకు 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ చెట్ల ఆకులు, కొమ్మలు, రెమ్మలు తడిచేటట్లు పిచికారి చేయాలి. ఆకులపై మసిని తొలగించేందుకు 2 కిలోల గంజి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ఉడికించి, తరువాత మిగితా నీరు పోసి 100 లీటర్ల గంజి ద్రావణం తయారు చేసి, తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారి చేయాలి.

బూడిద తెగులు: చలికాలంలో పూత దశలో ఈ తెగులు వస్తుంది. ఆకులు, పూత పిందెలపైన తెల్లటి బూడిద లాంటి పొడి ఏర్పడుతుంది. పూత, పిందె పసుపు రంగుకు మారి మగ్గి పోతుంది. తెగులు సోకిన ఆకు భాగం నల్ల రంగుకు మారతాయి. దీనిని నివారించేందుకు నీటిలో కరిగే గంధకం 2 గ్రా. లేక కెరాథేన్ 1 మి.లీ. లేక మైక్లోబ్యూటానిల్ 1 గ్రా. లేక బేలటాన్ 1 గ్రా. వీటిలో ఏదైన ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేసియాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందును మార్చి పిచికారి చేయడం ద్వారా బూడిద తెగులును అరికట్టుకోవాలి.