Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు నువ్వు పంటకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు కల నేలలు పనికిరావు. నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని, 2 సార్లు గుంటకతోలి, చదును చేయాలి.

Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

Pests In Sesame :

Pests In Sesame : ఖరీఫ్‌ పంటలు ఆలస్యంగా వేసిన పరిస్థితులలో రెండో పంటగా నువ్వును జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని, అతి తక్కువ సమయంలో, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించవచ్చు. ఖరీఫ్‌ మరియు రబీలో వర్షాధారంగా పండించే కంటే రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసుకుంటే చీడ పీడల బెడద తక్కువగా ఉంటుంది. విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు. మనరాష్ట్రంలో నువ్వు పంటను ముఖ్యముగా కోస్తా, రాయలసీమ, తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తారు.

మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు నువ్వు పంటకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు కల నేలలు పనికిరావు. నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని, 2 సార్లు గుంటకతోలి, చదును చేయాలి. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం, కాప్టాన్‌,మాంకోజెబ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తటం మంచిది.

నువ్వు సాగులో చీడపీడల నివారణ :

రసంపీల్చే పురుగులు : పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి. పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి, తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి క్రింది వైపుకు ముడుచుకొని పోయి, దోనె ఆకారంగా మారి పాలి పోతాయి. వీటి నివారణకు గాను మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్‌ 5 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు : తొలిదశలో చిన్న గొంగళి పురుగులు రెండు, మూడు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గోకి తినుట వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసికొని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్‌ లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహా ఏరి నాశనం చేయాలి.

కోడుఈగ : చిన్న పురుగులు లేత మొగ్గ, పూత తినివేయటం వలన మొగ్గలు పువ్వుగా, కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాలు కాయలు ఏర్పడతాయి. ఆశించిన మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన మొగ్గల్ని మరియు తాలు కాయల్ని ఏరి నాశానం చేయాలి. మొగ్గదశలో డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్‌ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా| లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బీహారి గొంగళి పురుగు : తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిని జల్లెడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కలపైకి ప్రాకుతూ మొగ్గలకు, పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినేస్తాయి. దీని నివారణకు పంటలో గ్రుడ్లు లేక గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి. ఎండోసల్ఫాన్‌ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.