Volunteers Honour : సత్కారంతో పాటు నగదు.. వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఎంపిక ప్రక్రియ ఇలా..

గ్రామ, వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Volunteers Honour : సత్కారంతో పాటు నగదు.. వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఎంపిక ప్రక్రియ ఇలా..

Cm Jagan

ap cm jagan good news for volunteers : గ్రామ, వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. సత్కారంతో పాటు నగదు కూడా ఇవ్వనున్నారు. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవారత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారం ఇచ్చి శాలువాతో గౌరవిస్తారు. ప్రకృతి వైపరీత్యాల్లో అందించిన సేవలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఉగాది రోజున అంటే ఏప్రిల్ 13న గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఏప్రిల్ 13న ఉగాది రోజున రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు.

3 కేటగిరీల్లో 2లక్షల 22వేల 900 మందికి సత్కారం:
మూడు కేటగిరీల్లో మొత్తం 2లక్షల 22వేల 900 మంది గ్రామ, వార్డు వాలంటీర్లను అవార్డులతో సత్కరించనున్నారు. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వాలంటీర్లకు అవార్డులు, సత్కార కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని రోజుల పాటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని చెప్పారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సీఎం జగన్ స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మొదటి కేటగిరీలో సేవా మిత్ర అవార్డు, రూ.10వేలు నగదు:
మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు. మొదటి కేటగిరీలో 2లక్షల 18వేల 115 మంది వాలంటీర్లకు ‘సేవా మిత్ర’ అవార్డు అందజేస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన వారికి అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.10 వేలు నగదు, ప్రసంశా పత్రం, శాలువా, బ్యాడ్జితో సత్కరించనున్నారు.

రెండో కేటగిరీలో సేవా రత్న అవార్డు, రూ.20వేలు నగదు:
రెండో కేటగిరీలో 4వేల మంది వాలంటీర్లకు ‘సేవా రత్న’అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటికే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున, కార్పొరేషన్లలో పది మంది చొప్పున మొత్తం 4వేల మంది వాలంటీర్లను ‘సేవా రత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.

మూడో కేటగిరీలో సేవా వజ్ర అవార్డు, రూ.30వేలు నగదు:
మూడో కేటగిరీలో 875 మంది వాలంటీర్లకు ‘సేవా వజ్ర’ అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటికే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.

ప్రజల ఇంటికే ప్రభుత్వ పథకాలు, సేవలు:
2019లో స్వాతంత్ర్య దినోత్సవం(ఆగస్టు 15) రోజున గ్రామ వాలంటీర్ వ్యవస్థ మొదలైంది. విజయవాడలో సీఎం జగన్‌ కొత్తగా ఎంపికైన వాలంటీర్లకు ఐడీ కార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకురావాలని.. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరికి ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు, సేవలు అందించాలనే గొప్ప ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. నవరత్నాలు, మేనిఫెస్టోలోని ప్రతి పథకం వాలంటీర్ల ద్వారానే అమలవుతుంది. పథకాలకు అర్హులైన లబ్థిదారుల్ని గుర్తించాల్సిన బాధ్యత వాలంటీర్లదే.

వాలంటీర్లకు కీలక బాధ్యతలు:
ఒక్కో వాలంటీర్ కు 50 ఇళ్ల బాధ్యతను ఇచ్చారు. ఆ ఇళ్లలో అర్హత ఉన్నా పథకం అందకపోతే.. వారిని గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి.. దరఖాస్తు చేయించే బాధ్యత తీసుకోవాలి. గ్రామ సచివాలయం ద్వారా అన్ని పనులు చేయించాలి. ఈ వ్యవస్థలో అవినీతి ఉండకూడదనే.. ప్రతి ఒక్కరికి రూ.5వేలు గౌరవ వేతంన ఇస్తున్నట్టు సీఎం చెప్పారు. డబ్బు చెడ్డదని.. ఎవరినైనా చెడగొడుతుందని.. అలాగే ఇంట్లో అవసరాలు ఉంటాయి కాబట్టి.. అందుకే ఈ గౌరవ వేతనం ఇస్తున్నామన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తే.. వారంతా లీడర్లవుతారని సీఎం జగన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

గతంలో డాక్టర్లకు చేతులెత్తి నమస్కారం పెట్టేవారని.. ప్రభుత్వం అప్పగించిన పనులు చేస్తే వాలంటీర్లకు ప్రజలు నమస్కారం పెడతారని జగన్ చెబుతారు. 50 ఇళ్లకు న్యాయం చేస్తే.. వాళ్ల గుండెల్లో నిలిచిపోతారని అంటారు. అందరూ యువతేనని.. జాగ్రత్తగా తమ బాధ్యతల్ని నిర్వర్తించాలని సూచించారు.