వణికించే చలిలో పూజారి న్యాయపోరాటం
న్యాయం చేయాలంటూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు దిగాడు.
Singanamala Durga Anjaneya Swamy temple priest
రాత్రి పూట వణికిస్తున్న చలిలోనూ ఓ పూజారి తనకు న్యాయం చేయాలంటూ పోరాటానికి దిగాడు. రాత్రంతా వణకుతున్న చలిలోనే నిరాహార దీక్ష చేశాడు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట అర్ధరాత్రి ఫుట్ పాత్ మీద పడుకున్నాడు. శింగనమల దుర్గ ఆంజనేయస్వామి ఆలయ పూజారి ఈ రకంగా చలిలో పోరాటానికి దిగాడు. కొన్ని సంవత్సరాలుగా శాంగనమల దుర్గ ఆంజనేయస్వామి ఆలయ పూజారిగా సేవలు అందిస్తున్నాడు.
అయితే, ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి చెందిన కొందరు తనను ఆలయంలో పూజలు చేయవద్దంటూ అడ్డుకన్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. వారి మాటలు వినకుండా పూజలు చేస్తున్నందుకు తనమీద భౌతికంగా దాడికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నాడు. ఆలయంలో పూజలు చేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
తనను పూజారి బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించాడు. తనకు ఎలాగైనా మీరే న్యాయం చేయాలంటూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు దిగాడు. ఉదయం నుంచి చేస్తున్న నిరాహార దీక్షకు తోడు రాత్రి పూట కూడా ఫుట్ పాత్ మీదే చలిలో వణుకుతూ తనకు న్యాయం చేయాలంటూ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.
