CM Jagan On Meters : రైతులకు పైసా ఖర్చు ఉండదు, పైగా బోలెడు ప్రయోజనాలు.. మోటర్లకు మీటర్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం జగన్ చెప్పారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని, దీని వల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.

CM Jagan On Meters : రైతులకు పైసా ఖర్చు ఉండదు, పైగా బోలెడు ప్రయోజనాలు.. మోటర్లకు మీటర్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan On Meters : ఇంధన శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్‌ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్‌ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్ లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్‌ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందన్నారు. కచ్చితమైన డిమాండ్‌ను తెలిపేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానాన్ని ఉపయోగించుకుంటున్నామని, గతంలో ఎంఓపీఈ 4 నుంచి 5 శాతం ఉంటే, ఇప్పుడు 2 శాతానికి తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్ పాడైన 24 గంటల్లోపే ట్రాన్స్‌ఫార్మర్‌ పెడుతున్నామని, దీనివల్ల రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని అధికారులు వివరించారు. గడిచిన 90 రోజుల్లో 99.5శాతం ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లోపే రీప్లేస్‌ చేశామన్నారు. కాగా, ఇది నూటికి నూరుశాతం జరగాలని సీఎం అన్నారు.

”బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలి. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలి. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. సులియారీ, మహానది కోల్‌బాక్స్‌ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ఆలోచనలు చేయాలి” అని అధికారులకు సూచించారు సీఎం జగన్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక, వ్యవసాయ మోటర్లకు మీటర్లపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మోటర్లకు మీటర్లపై రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని జగన్ సూచించారు. దీని వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలన్నారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని, దీని వల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు సీఎం జగన్. అలాగే దీని వల్ల రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవని చెప్పారు.

రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం జగన్ చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్నారు.

వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతామన్నారు. అక్కడి నుంచి ఆ డబ్బు రైతుల ద్వారా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుందన్నారు. దీని వల్ల రైతులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయన్నారు. గవర్నమెంట్ ఎంత ఇస్తోందనేది కూడా రైతులకు తెలుస్తుందన్నారు. తద్వారా రైతులకు ప్రశ్నించే హక్కు కలుగుతుందన్నారు. మోటార్లు కాలిపోయినా? నాణ్యమైన కరెంటు రాకపోయినా డిస్కంలను రైతు ప్రశ్నించగలుగుతాడని సీఎం జగన్ అన్నారు.