AP Crime : పెళ్లి చేయట్లేదని తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన కొడుకు

పెళ్లి చేయట్లేదని తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన కొడుకు ఘటనతో ఏపీలోని బందరులో తీవ్ర కలకలం రేపింది.

AP Crime : పెళ్లి చేయట్లేదని తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన కొడుకు

Crime

son who killed his mother :  ఈడొచ్చిన పిల్లలకు పెళ్లి చేయాలని ప్రతి తల్లికి ఉంటుంది. మంచి సంబంధం వస్తే పెళ్లి కుదిర్చి ఓ ఇంటివారిని చేస్తుంది. అలా ఓ తల్లి పెళ్లి ఈడొచ్చిన తన కొడుక్కి పెళ్లి చేయటానికి సంబంధాలు చూస్తోంది. కానీ ఎక్కడా కుదర్లేదు.దీంతో పెళ్లి కోసం పరితపించిపోతున్న సదరుకొడుకు నా ఇంకా పెళ్లి ఎప్పుడు చేస్తావు? అంటూ సాధించటం మొదలు పెట్టాడు. సరైన సంబంధం కుదరాలి కదరా..అని తల్లి సర్ధి చెబుతోంది. కానీ ఆ కొడుకు వినలేదు. నాకు పెళ్లి చేయట్లేదు నువ్వే కావాలని అంతా చేస్తున్నా అని తల్లిని అపార్థం చేసుకున్న ఆ కొడుకు తల్లిని అత్యంత దారుణంగా కొట్టి చంపిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. పెళ్లి చేయట్లేదని తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి హత్య చేసిన దారుణం ఏపీలోని బందరులో చోటుచేసుకుంది. కృష్ణాజిల్లలోని బందరులోని పరాసుపేటలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సమీపంలో గురువారం (నవంబర్ 25,2021) ఓ కొడుకు తల్లిని క్రికెట్ బ్యాట్టుతో కొట్టి చంపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చింతరాజు, వెంకటేశ్వరమ్మ దంపతులు పరాసుపేటలో నివాసం ఉటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్దకొడుకు హరీష్‌రావు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ ఇంటిలోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రెండో కొడుకు మచిలీపట్నంలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. హరీష్‌రావు తనకు పెళ్లి చేయాలంటూ గత కొంతకాలంగా తల్లితో గొడవపడుతున్నాడు. ఇదే విషయమై గురువారం తల్లితో ఘర్షణపడ్డాడు. దానికి తల్లి కొడుక్కి పలువిధాలుగా నచ్చచెప్పింది.

అ సమయంలో తండ్రి చింతరాజు ఇంట్లో లేడు. పనిమీద బయటకు వెళ్లాడు. తండ్రి ఇంట్లో లేకపోవటంతో హరీష్ రావుకి ఆగమని చెప్పేవాళ్లు లేక హరీశ్ రావు మరింతగా రెచ్చిపోయాడు. ఇంకా ఎంత కాలం నాకు పెళ్లి చేయకుండా ఉంటావు?అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. దానికి తల్లి ఏదో సర్ధిచెబుదామని యత్నించింది. కానీ తీవ్ర ఆగ్రహంలో ఉన్న హరీశ్ రావు విచక్షణ మరచిపోయాడు. అక్కడే ఉన్న క్రికెట్‌ బ్యాట్‌తో తల్లి తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె ఒక్కసారిగా నిలువునా కుప్పకూలిపోయింది. తీవ్రంగా రక్వస్రావం అయ్యింది.అది చూసి భయపడిపోయిన హరీశ్ రావు అక్కడనుంచి పరారయ్యాడు.

కొద్దిసేపు తరువాత ఇంటికి వచ్చిన తండ్రి చింతరాజు రక్తపుమడుగులో ఉన్న భార్య వెంకటేశ్వరమ్మను చూసి హడలిపోయాడు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. చింత్రరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.