Mohan Babu : రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశావ్..? : మోహన్‌ బాబు

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అల్లూరి సీతారామరాజు కోసం ఏమిచేశావంటూ ప్రముఖ నటుడు మోహన్ బాబు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావును ప్రశ్నించారు

Mohan Babu : రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశావ్..? : మోహన్‌ బాబు

Mohanbabu

Mohanbabu counter Avanthi: రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అల్లూరి సీతారామరాజు కోసం ఏమిచేశావంటూ ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావును నవ్వుతూ ప్రశ్నించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు ఆదివారం హైదరాబాద్ ఫిలింనగర్లోని కల్చరల్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమానికి ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలంగాణ పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నేతలు ఆవిష్కరించారు.

Also read: Vangaveeti Radha: చంద్రబాబు చెప్పినట్టు రాధా చేస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి

అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ.. అల్లూరి పుట్టిన గడ్డపై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి అవంతి.. అల్లూరి కోసం ఏమి చేశారో చెప్పాలని సరదాగా ప్రశ్నించారు. మధ్యలో కలగజేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మంత్రి అవంతిని వదిలేయమంటూ అడిగారు. దీంతో కిషన్ రెడ్డి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నానని మోహన్ బాబు అనడంతో వేదికపైన ఉన్నవారు సరదాగా నవ్వుకున్నారు. తాను రూ.300 జీతానికి అల్లూరి సీతారామరాజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా కిషన్ రెడ్డి కృషి చేయాలని కోరారు. గతంలోలాగా సినిమాలు వంద రోజులు ఆడటం లేదని.‌‌. ఇప్పటి సినిమాలు ఒకటి రెండు రోజులు ‌మాత్రమే ఆడుతున్నాయని మోహన్ బాబు చెప్పారు.

ఈసందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ నా చిన్న తనంలో అగ్గి రాముడు సినిమా చూసినప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలిసిందని తెలిపారు. అంత గొప్ప వీరుడి కథను ఎవరైనా సినిమా తీస్తే చూడాలని ఉండేదన్న కృష్ణ.. తానే అల్లూరి సీతారామరాజుగా నటించడం అదృష్టంగా భావించినట్లు తెలిపారు. తన వందవ చిత్రంగా అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని, తానే స్వయంగా నటించి నిర్మించినట్లు కృష్ణ తెలిపారు. తన జీవితంలోనే అత్యుత్తమ చిత్రం అల్లూరి సీతారామరాజు అంటూ కృష్ణ భావోద్వేగానికి గురయ్యారు.

Also Read: RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?