ఆధార్ నెంబర్ ఉంటే ఈజీగా ఆన్ లైన్ లోనే పాన్ కార్డు

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 06:35 AM IST
ఆధార్ నెంబర్ ఉంటే ఈజీగా ఆన్ లైన్ లోనే పాన్ కార్డు

పాన్ కార్డు తీసుకునే వారు ఇక పై ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు వెంటనే ఆన్ లైన్ ద్వారా నిమిషాల్లో పాన్ కార్డు తీసుకునే సదుపాయాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు రెవెన్యూ శాఖ అధికారి అజయ్ భూషణ్ పాండే తెలిపారు.

పాన్ కార్డును ఆన్ లైన్ ద్వారా తీసుకునే ప్రక్రియను గురించి మాట్లాడుతూ.. ఆదాయ పన్నుశాఖ వెబ్ సైట్ లోకి వెళ్ళి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే వెంటనే మీ రిజిస్టర్డ్ మెుబైల్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్(OTP) వస్తుంది. అలా వచ్చిన OTP ని ఎంటర్ చేయటంతో ఆధార్ వివరాలు పరిశీలించటం జరుగుతుంది. తద్వారా పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త పద్ధతి నెలాఖరు నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

ఈ కొత్త పద్ధతి ద్వారా ఆదాయ పన్ను చెల్లించే అభ్యర్దులు దరఖాస్తు ఫారమ్ నింపి ఆదాయ పన్ను శాఖకు సమర్పించడంలో ఉన్న ఇబ్బందులను ఎదుర్కోటానికి సహాయపడుతుందని అజయ్ భూషణ్ పాండే చెప్పారు. అంతేకాకుండా ఆదాయ పన్ను చెల్లించే అభ్యర్ధులు ఇంటికి పాన్ కార్డు పంపే ప్రక్రియ అధికారులకు సులభం అవుతుందని అన్నారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసే ప్రక్రియను మార్చి 31, 2020 వరకు పోడిగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసే ప్రక్రియను తప్పని సరి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ తో లింక్ చేయబడ్డాయి. అంతేకాకుండా జనవరి 27, 2020 నాటికి 17.58 కోట్లకు పైగా ఉన్న పాన్ కార్డులు ఇంకా ఆధార్ తో లింక్ చేయాల్సి ఉందని చెప్పారు.