కరోనా ఎఫెక్ట్‌తో పతనమైన సెన్సెక్స్… 5 నిమిషాల్లో 5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 07:28 AM IST
కరోనా ఎఫెక్ట్‌తో పతనమైన సెన్సెక్స్… 5 నిమిషాల్లో 5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది

స్టాక్‌మార్కెట్లకు కరోనా సోకింది. వైరస్‌ విస్తరణ భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. భారతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముదుపరులకు నిమిషాల్లో సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది. సెన్సెక్స్‌ 11వందలు, నిఫ్టీ 3వందల పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 11వేల 3వందల పాయింట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్‌లోని దాదాపు అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. అన్ని ఇండెక్స్‌లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 

గత ఐదురోజులుగా మన మార్కెట్లు నష్టాల్లోనే ముగుస్తున్నాయి. ఇటు అమెరికన్‌ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. భారతీయ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా పతనమై 38,601 వద్దకు చేరుకుంది. ముదుపరులకు నిమిషాల్లో సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది.

గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 1,550 పాయింట్లకు పైగా పడిపోయింది. విస్తృత నిఫ్టీ ఈ రోజు 11,300 స్థాయిని దాటింది. కరోనా వైరస్ నేపథ్యంలో 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత మళ్లీ ఈ వారం ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. 

చైనాలో కరోనా వైరస్‌ బయటపడినప్పటి నుంచి మార్కెట్లపై ఒత్తిడి పడుతోంది. అయితే ఇప్పుడు వైరస్‌ మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తుండటం మార్కెట్లను దారుణంగా దెబ్బతీస్తోంది. చైనా PMI కూడా పదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 

టిసిఎస్, ఆర్‌ఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి మరియు ఇన్ఫోసిస్ షేర్స్ 2.5శాతం, 3.5శాతం మధ్య క్షీణించాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ లో వీటి షేర్లు 4శాతం, 5శాతం మధ్య క్షీణించాయి.

డిసెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వం జిడిపి సంఖ్యలను ప్రకటిస్తుంది. ఆర్థికవేత్తల రాయిటర్స్ పోల్ సగటు అంచనా డిసెంబర్ త్రైమాసికంలో వార్షిక ఆర్థిక వృద్ధి 4.7శాతంగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 4.5శాతం కంటే స్వల్పంగా పెరిగింది. కానీ ప్రస్తుతం 4.5శాతం వార్షిక వృద్ధిని సాధించడం కూడా ఒక సవాలుగా ఉంటుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలతో భారత మార్కెట్లు అస్థిరతను ప్రదర్శిస్తాయని నమ్ముతున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ విపి – రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు.

Also Read | కరోనా భయం లేదులే: హైదరాబాద్‌లో చికెన్, ఎగ్ మేళా