VK SasiKala : శశికళకు షాకిచ్చిన ఐటీ శాఖ…రూ. 100 కోట్ల ఆస్తులు జప్తు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఆదాయపన్ను శాఖ ఝలక్ ఇచ్చింది. శశికళకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను విభాగం ఈరోజు జప్తు చేసింది.

VK SasiKala : శశికళకు షాకిచ్చిన ఐటీ శాఖ…రూ. 100 కోట్ల ఆస్తులు జప్తు

Vk Sasikala

VK SasiKala :  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఆదాయపన్ను శాఖ  మళ్లీ  ఝలక్ ఇచ్చింది. శశికళకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను విభాగం ఈరోజు జప్తు చేసింది. బినామీ లావాదేవీల చట్టం కింద బుధవారం ఆమెకు చెందిన 11 ఆస్తులను ఐటీ అధికారులు స్వాధీనం  చేసుకున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన వీటి విలువ అప్పట్లో  సుమారు రూ.20 లక్షలు మాత్రమే. ప్రస్తుతం వీటి విలువ రూ. 100 కోట్లకు చేరింది.

2014లో కర్ణాటక స్పెషల్ కోర్ట్ జడ్జి జాన్ మిఖైల్ కున్హా ఈఆస్తులను అక్రమాస్తులుగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పారు. ఆనాటి కోర్టు తీర్పును అనుసరించి బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద   ఐటీశాఖ ఈరోజు ఆ ఆస్తులను సీజ్ చేసింది. ఆస్తులు ఉన్న ప్రాంతంలో వాటిని సీజ్ చేసినట్టు నోటీసులు అతికించారు.

చెన్నెలో శశికళకు సంబంధించిన 65 ఆస్తులను గతేడాది ఐటీ అటాచ్‌ చేసింది. 2019లో రూ.1,600 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి.

1991 జూలై నుంచి ఏప్రిల్‌ 1996 వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్‌ సుధాకరన్‌ పేర్ల మీద  భారీగా ఆస్తుల  కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. బినామీ చట్టం కింద శశికళకు చెందిన చాలా ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్స్ లో జయలలిత ఇంటి ఎదురుగా శశికళ నిర్మించిన ఆధునిక విలాస వంతమైన భవనాన్ని కూడా ఐటీ అధికారులు జప్తు చేశారు. మన్నార్‌గుడి‌తో పాటు పలు ప్రాంతాలలో ఆమెకొన్న విలువైన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.

కాగా 2017 ఫిబ్రవరిలో ఆక్రమాస్తుల కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహర జైలుకు వెళ్లిన శశికళ (67) ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలై తమిళనాడు వచ్చారు. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆక్రమాస్తుల కేసులో ఆమెపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఆమె కీలకపాత్ర పోషిస్తుంది అనుకుంటే ఆమె రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించింది.  మళ్లీ ఇటీవల జరుగుతున్న పరిణామాల  నేపధ్యంలో ఆమె తిరిగి రాజకీయాల్లోకి    రావాలనుకుంటోందని  ఆమె సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. కానీ..తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఆమె యత్నాలను అన్నాడీఎంకే వర్గాలు అడ్డుకుంటున్నాయి.