Madhu Srivastava: మీ కాలర్ పట్టుకున్నోడిని ఇంటికెళ్లి కాల్చి పారేస్తా.. బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Madhu Srivastava: మీ కాలర్ పట్టుకున్నోడిని ఇంటికెళ్లి కాల్చి పారేస్తా.. బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Madhu Srivastava controversial comments over gujarat polls

Updated On : November 17, 2022 / 6:38 PM IST

Madhu Srivastava: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎవరైనా మీ కాలర్ పట్టుకుంటే నేను వారి ఇంట్లోకి దూరి వారిని కాల్చివేస్తాను. అలా చేయకుంటే నా పేరు మధు భాయ్ కాదు’’ అంటూ కార్యకర్తలతో చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మధు శ్రీవాస్తవ గుజరాత్‌లోని వాఘోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఈసారి ఎందుకో బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో అశ్విన్ పటేల్‌ను బీజేపీ రంగంలోకి దించింది. అదే సమయంలో శ్రీవాస్తవ స్పందిస్తూ తన మద్దతుదారులు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మధు శ్రీవాస్తవ బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో బలమైన అభ్యర్థి ధర్మేంద్ర సింగ్ వాఘేలాతో పోటీ పడ్డారు. వాఘేలాను ఆయన మద్దతుదారులలో బాపు అని పిలుస్తారు. అంతటి పేరు ఉన్న వ్యక్తిపై మధు గెలిచారు. మధు శ్రీవాస్తవ కంటే ముందే చాలా మంది గుజరాత్ బీజేపీ నేతలు పార్టీని వీడారు. నవంబర్ 11న రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కేసరి సింగ్ సోలంకి టికెట్ నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోలంకీ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. సోలంకి గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని మాటర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.

వాస్తవానికి మధు శ్రీవాస్తవది గుజరాత్ కాదు. యూపీలోని హమీర్‌పూర్ జిల్లా రత్ తహసీల్‌లోని ధామ్నా గ్రామానికి చెందిన వ్యక్తి. మధు తండ్రి చాలా కాలం క్రితం వడోదరకు వలస వచ్చారు. హైస్కూల్ వరకు చదివిన మధు శ్రీవాస్తవ రాజకీయాల వైపు మళ్లారు. అనంతరం తన స్వభావ రిత్యా రాజకీయంగా ఎదిగారు. అలా ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బాహుబలిగా ప్రసిద్ధి చెందారు.

Maharashtra: సీఎం సందర్శన అనంతరం బాలాసాహేబ్ థాకరే సమాధిని గోమూత్రంతో కడిగారు