గుడిలో మహిమలు :రియల్ ఎస్టేట్ కోసం స్వామీజీ ప్రచారం

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 09:32 AM IST
గుడిలో మహిమలు :రియల్ ఎస్టేట్ కోసం స్వామీజీ ప్రచారం

నార్కెట్‌ పల్లి  : నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌ పల్లి వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్‌, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. శ్రీవారిజల వేణుగోపాల స్వామి వారి ఆలయంలో  89  సంవత్సరాలకొకసారి  వచ్చే అమావాస్య పర్వదినాన  వేణుగోపాల స్వామిపై  సూర్యకిరణాలు పడతాయనే భక్తులు నమ్ముతుంటారు.  
ఈ  క్రమంలో నార్కెట్‌ పల్లి-చిట్యాల మధ్య కిలోమీటర్ల పొడవున వాహనాలు జామ్‌ కావడంతో కంట్రోల్‌ చేయలేక ట్రాఫిక్‌ సిబ్బంది చేతులెత్తేశారు. బుధవారం (మార్చి6) రోజున వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని గురు దత్త లక్ష్మీకాంత శర్మ అనే ఓ  స్వామీజీ చెప్పడంతో జిల్లా..రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వచ్చారు. 
 

దీంతో హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వేణుగోపాలస్వామి దర్శనం కోసం వచ్చిన వేలాదిమంది  భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే  స్వామీజీ చేత ప్రచారం చేయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై నార్కెట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

స్వామి దర్శనం..స్వామీజీ ప్రచారంలో కొత్తకోణం 
నార్కెట్ పల్లి వారిజాల వేణుగోపాల స్వామి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రావడం లో కొత్త కోణం..* 
– తప్పుడు ప్రచారం వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు…..
– పలు టి.వి.చానల్స్, భక్తి కార్యక్రమాల నిర్వాహకులతో రియల్ వ్యాపారుల కుమ్మక్కూ…..
– దేవాలయం చుట్టు పక్కల భూములు అధిక ధరలకు విక్రయించుకునేందుకు కొత్త పద్దతిలో ప్రజలను మోసం చేస్తూన్న వైనం
– రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దేవాలయ ట్రస్టు సభ్యుల మధ్య ఫోన్ కాల్స్ గుర్తించిన పోలీసులు
– కాల్ డేటా ఆధారంగా ప్రజలను మోసం చేస్తున్న వ్యక్థులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్దమవుతున్న పోలీసులు
– తప్పుడు ప్రచారాలు, టి.వి.లలో వచ్చే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దంటున్న పోలీసులు
– కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, దేవాలయాన్ని మరింతగా ప్రమోట్ చేసుకునేందుకే ఇలాంటి ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారంటున్న పోలీసులు