దిశ కేసుపై చార్జిషీట్

దిశ కేసుపై చార్జిషీట్

నెలాఖరులోగా దిశకేసుకు ఛార్జిషీట్ వేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. డీఎన్ఏ రిపోర్టుతో పాటు ఫోరెన్సిక్ నివేదికలను సేకరించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిన ప్రాంతం సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను తీసుకున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ లను కూడా సేకరించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేర 50 మందికి పైగా సాక్షుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. దాదాపుగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించామని త్వరలోనే చార్జిషీట్ వేసేందుకు సిద్ధమవుతోన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎఫ్ ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. నలుగురు నిందితుల వయస్సు 19 ఏళ్లని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు. డిసెంబర్ 6న నిందితులను చటాన్ పల్లికి తీసుకెళ్లామని వెల్లడించారు. బాధితురాలి వస్తువులు రికవరీ కోసం వారిని తీసుకెళ్లామని పోలీసులు చెప్పారు. షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదు మేరకు ఎన్ కౌంటర్ పై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ ఐఆర్ కాపీలో ఉంది. 

నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నాక డిసెంబర్ 6న సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం నిందితులను చటాన్ పల్లి బ్రిడ్జీ దగ్గరకు తీసుకెళ్లారు. ఉదయం 6.10 సమయంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం పది మంది పోలీసులు నలుగురు నిందితులను అక్కడికి తీసుకెళ్లారు. నిందితులు రాళ్లు రువ్వారని, కర్రలతో దాడి చేశారని, వెపన్స్ లాక్కొన్నారని పోలీసులు చెప్పారు.

ఏ1 ఆరీఫ్, ఏ4 చెన్నకేశవులు రెండు వెపన్స్ లాక్కొని కాల్పులు జరిపారని..ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణలో భాగంగానే వారిపై కాల్పులు జరిపామని ఎఫ్ ఐఆర్ లో పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయినట్లు పోలీసులు ఎఫ్ ఐఆర్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఏసీపీ సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్ నగర్ పోలీసులపై కేసు నమోదు చేశారు.