సతీష్ హత్య కేసు : వివాహేతర సంబంధం లేదు – ప్రశాంతి

  • Edited By: madhu , May 28, 2020 / 03:44 PM IST
సతీష్ హత్య కేసు : వివాహేతర సంబంధం లేదు – ప్రశాంతి

తన భర్తకు ఎవరితోనూ వివాహేతర సంబంధం లేదని కూకట్‌పల్లిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సతీశ్‌ భార్య ప్రశాంతి స్పష్టం చేశారు. కేవలం వివాహేతర సంబంధమే హత్యకు కారణం అంటూ కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హేమంత్ విషయంలో పాముకు పాలు పోసినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సప్‌, కాల్ డేటా ఆధారంగా హత్యలో ఎవరెవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్‌ చేశారు. హేమంత్‌, క్రాంతి, ప్రియాంకతో పాటు బిజినెస్‌ పార్ట్ నర్స్‌ను విచారించాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రశాంతి.

హైదరాబాద్ కేపీహెచ్‌బీలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీశ్‌ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల విచారణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. హేమంత్ ఇంటికి మద్యం తాగేందుకు వెళ్లి సతీశ్‌ హత్యకు గురయ్యాడని గుర్తించిన పోలీసులు హత్యకు ముందురోజు ప్రియాంకను హాస్టల్ వద్ద సతీశ్‌ డ్రాప్ చేసినట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. ప్రియాంకను దింపేశాక.. సతీశ్‌ ఎక్కడకు వెళ్లాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్యకు ఫోన్‌ చేసిన ఇతను హేమంత్‌ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పాడని పోలీసులు అంటున్నారు. సతీశ్‌ హత్యకు ఎవరు సహాయం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియాంకతో సతీశ్‌ చనువుగా ఉండటమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తుంటే సతీశ్‌ కుటుంబసభ్యులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలే కారణమంటున్నారు. ఇప్పటికే హేమంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఈ దిశగా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Read More : అమ్మ కానికి గర్భం : నల్గొండలో సరోగసి కలకలం