గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..ఏర్పాట్లు పూర్తి

  • Published By: madhu ,Published On : September 12, 2019 / 12:48 AM IST
గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..ఏర్పాట్లు పూర్తి

వినాయక నవరాత్రుల చివరి ఘట్టం దగ్గరకు వచ్చింది. ఘనంగా భక్తుల పూజలనందుకున్న ఏకదంతుడు గంగమ్మ తల్లి ఒడి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్‌ మహా గణపతిని నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్నటివరకు లక్షలాది మంది భక్తులతో పూజలందుకు భారీ లంబోదరుడు…సెప్టెంబర్ 12వ తేదీ గురువారం నిమజ్జనానికి కదిలివెళ్లనున్నాడు. ఇప్పటికే కలశ పూజను పూర్తిచేసిన నిర్వాహకులు… క్రేన్‌ సాయంతో గణనాథుడిని ట్రాలీపైకి ఎక్కించారు. ప్రస్తుతం వాహనం అలంకరణ పనులు చేస్తున్నారు

ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ లాంటి ప్రసిద్ధ గణేష్ విగ్రహాలు చివరి రోజు నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడిని తొలి నిమజ్జనం చేయనున్నారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గరకు ఖైరతాబాద్ గణేశుడు చేరుకోనున్నాడు. అనంతరం అన్ని కార్యక్రమాలు ముగించి మధ్యాహ్నం ఒంటి గంటలోపే నిమజ్జనం చేయనున్నారు. ఈసారి మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా లోతు పెంచారు.

ఖైరతాబాద్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర ట్యాంక్ బండ్ చేరుకొనేసరికి ఉదయం 11 గంటలకు దాటే అవకాశం కనిపిస్తోంది. శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిగా ఈసారి కొలువు దీరాడు. ఈ భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వినాయకుడిని తీసుకెళ్లే భారీ ట్రక్కు వినాయక మంటపానికి చేరుకుంది. వెల్డింగ్ వర్క్ కూడా ముగిసింది. భారీ గణపతిని ట్రక్కుపైకి ఎక్కించారు. మరోవైపు గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది పోలీసు యంత్రాంగం. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. వేల మందితో పహారా కాస్తూ… చిన్న అవాంఛనీయ ఘటన జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధమైన అధికారులు.. సందర్శకులకు ఇబ్బందులు తలెత్తితే తమను సంప్రదించవచ్చని చెప్పారు. ఇందుకోసం 040-27852482, 9490598985, 9010203626 హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు.

> శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి విగ్రహం వెడల్పు 28 అడుగులు, బరువు 50 టన్నులు. 61 అడుగుల ఎత్తు. 
> 12 తలలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుడి, ఎడమ వైపున ఐదు తలలు, ప్రధాన తల పై భాగంలో మరో తలను ఏర్పాటు చేశారు. మొత్తం 16 చేతులు ఉన్నాయి. 
> 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో భారీ గణపతిని రూపొందించారు. 
> వినాయకుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి, ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గా దేవి కొలువు దీరారు. 
> ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గణనాథుడు రూపుదిద్దుకున్నాడు. 
Read More : బై బై గణేషా : నిమజ్జనానికి సర్వం సిద్ధం