నో సౌండ్..నో పొల్యూషన్: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ : అన్ని రంగాల్లో అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందుతున్ హైదరాబాద్ నగరంలో మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. సడీ సప్పుడు లేని..వాతావరణ కాలుష్యం లేని ఎలక్ట్రిక్ బస్సులు భాగ్యనగరం రోడ్లపై 40 ఎలక్ట్రిక్ బస్సులు పరుగిడనున్నాయి. ఈ అపురూప ఘట్టానికి మార్చి 5న అంకురార్పణ జరగనుంది.
ఈ బస్సుల రూట్స్ఇలా..
ప్రధానంగా రెండు మార్గాల ద్వారా వీటిని నడపనున్నారు. మియాపూర్ తో పాటు కంటోన్మెంట్ డిపో నుంచి ఈ బస్సులు నడుస్తాయి.కంటోన్మెంట్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. అలాగే మియాపూర్ డిపోకు చెందిన బస్సులు BHEL తో పాటు మియాపూర్ నుంచి నడుస్తాయి. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి విమానాశ్రయానికి 265 రూపాయలు ఛార్జీ వసూలు చేయనుండగా.. మియాపూర్ నుంచి 280 వరకు ఛార్జీలు ఉండనున్నాయి.వీటిలో ఏసీ, వైపై, రేడియో సిస్టం లాంటి లేటేస్ట్ సదుపాయాలు ప్రయాణీకులకు కొత్త అనుభూతిని కలుగుతుందనటం ఖాయమంటున్నారు అధికారులు.
ఎలక్ట్రిక్ బసెస్ స్పెషాలిటీస్
12 మీటర్ల పొడవుతో ఉండే ఈ ఎలక్ట్రిక్ బస్సులో డ్రైవర్ తో పాటు మరో 39 మంది ప్రయాణించవచ్చు. అంటే 40 కెపాసిటీ అన్నమాట. లిథియం ఇయాన్ బ్యాటరీతో నడిచే ఈ ఎలక్ట్రిక్ బస్సులు.. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎలాంటి ఆటంకాలు లేకుండా దాదాపు 250 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. సుమారుగా 5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందట. వయో వృద్ధులు ఎక్కి దిగడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం విశేషం. ఎయిర్, సౌండ్ పొల్యూషన్ లేకపోవడం ఈ బస్సుల స్పెషాలిటీ.
నో టెన్షన్.. హ్యాపీ జర్నీ
నో టెన్షన్.. హ్యాపీ జర్నీ ఆర్టీసీ కొత్తగా తెరపైకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టెంపరేచర్ పెరిగినప్పుడు గానీ, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు గానీ.. ప్రాణనష్టం జరగకుండా స్పెషల్ ప్రొటెక్షన్ వ్యవస్థను సిద్ధం చేశారు. ముందు వెనకాల సౌకర్యవంతమైన సస్పెన్షన్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణ అనుభూతి లభిస్తుంది. అంతేకాదు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ విధానంతో పాటు ఎల్ఈడీ లైటింగ్ ఈ బస్సులకు ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.
చార్జీలు ఇలా ఉంటాయ్
కంటోన్మెంట్ నుంచి ఉప్పల్ మార్గంలో ఎయిర్ పోర్టుకు నడిచే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఛార్జీలు ఈ విధంగా ఫిక్స్ చేశారు. జేబీఎస్, సంగీత్, తార్నాక స్టాపుల నుంచి విమానాశ్రయానికి 265 రూపాయలు.. ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ నుంచి 210 రూపాయలు.. చాంద్రాయణగుట్ట నుంచి 160 రూపాయలు.. పహాడీషరీఫ్ నుంచి 105 రూపాయలు వసూలు చేయనున్నారు. అలాగే ఆరాంఘర్ మార్గంలో నడిచే బస్సుల్లో జేబీఎస్, సంగీత్, సెక్రటేరియట్ స్టాపుల నుంచి ఎయిర్ పోర్టుకు 265 రూపాయలు.. ఏసీ గార్డ్స్, ఎన్ఎండీసీ నుంచి 210 రూపాయలు.. ఆరాంఘర్ నుంచి 160 రూపాయలు.. శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు 105 రూపాయలు ఛార్జీలుగా నిర్ణయించారు.