ముఖ్యగమనిక : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, మద్యం షాపులు బంద్

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 01:50 AM IST
ముఖ్యగమనిక : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, మద్యం షాపులు బంద్

ఆదివారం(ఏప్రిల్ 14,2019) శ్రీరామనవమిని పురస్కరించుకుని జంట నగరాల్లో శ్రీరాముడి శోభాయాత్ర జరగనుంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. అలాగే మద్యం షాపులు బంద్ చేయించారు. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని 3 పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఆదివారం(ఏప్రిల్ 14) మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్‌, రాచకొండ పరిధుల్లోని మద్యం, కల్లు దుకాణాలు, బార్‌లను ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసేయాలని ఆదేశించారు. జంటనగరాల్లో శ్రీరామనవమి సందర్భంగా భారీఎత్తున ఊరేగింపు ఉంటుంది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా నగరంలో నిర్వహించనున్న శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. యాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో బందోబస్తుతోపాటు ట్రాఫిక్‌ మళ్లింపులపై అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. యాత్ర జరగనున్న మార్గాలను పరిశీలించడంతో పాటు యాత్రకు అడ్డంకిగా మారిన వాటిని తొలగించడం ద్వారా యాత్ర సాఫీగా జరిగే ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీతారాంబాగ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాల దగ్గర ముగుస్తుంది. యాత్ర జరుగుతున్న సమయంలో అక్కడ ట్రాఫిక్‌ నియంత్రణతోపాటు సాధారణ వాహనాలను దారి మళ్లించడం వంటి వాటిపై దృష్టి సారించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సందర్భంగా లిబర్టీ, కోటి, హిమాయత్ నగర్, ఎంజే మార్కెట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు:
* ఆసిఫ్‌ నగర్‌ నుంచి వచ్చే వాహనాలు బోయిగూడ కమాన్‌ నుంచి మల్లేపల్లి వైపునకు పంపుతారు.
* బోయిగూడ కమాన్‌ నుంచి సీతారాంబాగ్‌ వెళ్లే వాహనదారులను ఆగాపూరా వైపునకు పంపుతారు.
* ఆగాపురా, హబీబ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలను దారుస్సలామ్‌ వైపునకు మళ్లిస్తారు.
* బోయిగూడ కమాన్‌ నుంచి పురానాపూల్‌ వెళ్లే వాహనదారులు దారుస్సలామ్‌ వైపుగా వెళ్లాలి.
* పురానాపూల్‌ నుంచి వచ్చే వాహనాలను పేట్ల బురుజు, కుల్సంపూర, కార్వాన్‌ వైపునకు మళ్లిస్తారు.
* ఎంజే బ్రిడ్జ్‌ నుంచి జుమ్మేరాత్‌బజార్‌ వెళ్లే వాహనాలను సిటీకాలేజ్‌ వైపునకు మళ్లిస్తారు.
* మాలకుంట నుంచి ఎంజేబ్రిడ్జ్‌ వైపునకు వెళ్లే వాహనాలను దారుస్సలామ్‌, అలస్కా వైపునకు మళ్లిస్తారు.
* అఫ్జల్‌గంజ్‌ నుంచి సిద్ధిఅంబర్‌ బజార్‌ వైపునకు వెళ్లే వాహనాలను సాలార్‌జంగ్‌ బ్రిడ్జ్‌మీదుగా పంపుతారు.
* కోఠి, రంగమహల్‌ నుంచి వచ్చే వాహనాలు గౌలిగూడ చమన్‌ వైపునకు అనుమతించరు, వాటిని జాంబాగ్‌ వైపునకు మళ్లిస్తారు.
* అఫ్జల్‌గంజ్‌ నుంచి ఎంజే బ్రిడ్జ్‌ వైపునకు వెళ్లే వాహనదారులు మదీన, హైకోర్ట్‌, సిటీ కాలేజ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
* అఫ్జల్‌గంజ్‌ నుంచి వచ్చే వాహనాలను సెంట్రల్‌ లైబ్రరీ, ఎస్‌జేబ్రిడ్జ్‌ వైపునకు మళ్లిస్తారు.
* రంగమహల్‌ నుంచి వచ్చే వాహనాలను సీబీఎస్‌ వైపునకు మళ్లిస్తారు.
* ఆంధ్రాబ్యాంక్‌ నుంచి వచ్చేవాహనాలను జాంబాగ్‌ వైపునకు మళ్లిస్తారు.
* బ్యాంక్‌ స్ట్రీట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు డీఎంహెచ్‌ఎస్‌ వైపునకు మళ్లిస్తారు.
* చాదర్‌ఘాట్‌ నుంచి వచ్చేవాహనాలను కాచిగూడ స్టేషన్‌ రోడ్‌కు మళ్లిస్తారు.
* చర్మాస్‌ నుంచి వచ్చే వాహనాలను ఎంజేమార్కెట్‌ వైపునకు మళ్లిస్తారు.
* ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్‌ స్ట్రీట్‌, జీపీవో వైపు వాహనాలను అనుమతించరు.
* కింగ్‌ కోఠి నుంచి వచ్చే వాహనాలను హనుమాన్‌ టేక్డీ వైపునకు అనుమతించరు.