టీఆర్ఎస్ ఎక్స్‌ అఫీషియో అస్త్రానికి విపక్షాలు కకావికలం

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కారు స్పీడుకు విపక్షాలు బేజారయ్యాయి. అధికార పార్టీ సంధించిన ఎక్స్‌ అఫీషియో అస్త్రానికి కకావికలమయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 01:42 AM IST
టీఆర్ఎస్ ఎక్స్‌ అఫీషియో అస్త్రానికి విపక్షాలు కకావికలం

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కారు స్పీడుకు విపక్షాలు బేజారయ్యాయి. అధికార పార్టీ సంధించిన ఎక్స్‌ అఫీషియో అస్త్రానికి కకావికలమయ్యాయి.

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కారు స్పీడుకు విపక్షాలు బేజారయ్యాయి. అధికార పార్టీ సంధించిన ఎక్స్‌ అఫీషియో అస్త్రానికి కకావికలమయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల బీజేపీకి కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతిచ్చుకున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టించింది. 120 మున్సిపాలిటీలకు గాను 110 చైర్మన్ పీఠాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నాలుగు మున్సిపాలిటీలు.. బీజేపీ రెండు మున్సిపాలిటీలు, ఎంఐంఎ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. మిగిలిన రెండు మున్సిపాలిటీలకు గాను మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వెళుతుంది. నేరేడుచర్లపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. 

అటు తొమ్మిదికి తొమ్మిది కార్పొరేషన్లలో టీఆర్ఎస్‌ క్లీన్ స్వీప్ చేసింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా టీఆర్ఎస్‌ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.  రామగుండంలో పార్వర్డ్‌ బ్లాక్‌తో కలిసి టీఆర్ఎస్‌ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.  ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా  మద్దతివ్వడంతో  టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ కార్పొరేషన్‌ను దక్కించుకుంది. బడంగ్‌పేట్‌లో కార్పొరేషన్‌లో హైడ్రామా సాగింది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పారిజాత టీఆర్ఎస్‌లో చేరి ఏకంగా మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లోని మున్సిపల్ పీఠాలను టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో 16 చోట్ల టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. 

అధికార పార్టీ విసిరిన ఎక్స్‌ అఫీషియో అస్త్రంతో కాంగ్రెస్‌ చిత్తయిపోయింది. దాదాపు 10 స్థానాల్లో టీఆర్ఎస్‌ కంటే మెరుగైన స్థానాలు సాధించినా చైర్మన్‌ పదవిని మాత్రం పొందలేకపోయింది. మణికొండలో కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ మద్దతునివ్వగా.. మక్తల్‌లో బీజేపీకి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది.   బీజేపీ మద్దతుతో మణికొండ మున్సిపల్‌ ఛైర్మన్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. వడ్డేపల్లి, మణికొండ, చండూర్‌ మున్సిపాలిటీలను మాత్రమే కాంగ్రెస్‌ దక్కించుకుంది. తుక్కుగూడలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినా చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. మక్తల్‌లో కాంగ్రెస్‌ మద్దతుతో బీజేపీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆమన్‌గల్ మున్సిపాలిటీని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.

టీఆర్ఎస్‌ పార్టీ సైతం ఓ చోట బీజేపీ సహకారాన్ని, మరోచోట కాంగ్రెస్ సహకారంతో చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. నల్లగొండ మున్సిపాలిటీలో ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్ల సహాయంతో టీఆర్ఎస్‌ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. భూత్పూర్‌లో బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేరడంతో గులాబీ పార్టీ మున్సిపాలిటీని దక్కించుకుంది. అమరచింతలో సీపీఐ కౌన్సిలర్ మద్దతుతో టీఆర్ఎస్‌ చైర్మన్‌గిరీని సొంతం చేసుకుంది. సీపీఐకి వైస్‌ చైర్మన్ పదవి ఇచ్చింది. చౌటుప్పల్‌లో సీపీఎం సహకారంతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్‌.. కామ్రేడ్‌కు వైస్‌ చైర్మన్ పదవి కట్టబెట్టింది. 

ఐజ, మంచిర్యాలలో ఫార్వర్డ్ బ్లాక్‌తో జట్టుకట్టి చైర్మన్‌ పీఠాలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంది. కోస్గి, కొల్లాపూర్, హాలియా, భువనగిరి, ఖానాపూర్, ఆదిలాబాద్‌, ధర్మపురి, హుస్నాబాద్‌, తుక్కుగూడ, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట్‌ మున్సిపాలిటీల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ లేకపోయినా ఎక్స్‌ అఫీషియో ఓట్లతో ఆయా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పాగా వేసింది.  అటు భైంసా, జల్‌పల్లి పురపాలక సంఘాల్లో ఎంఐఎం పాగా వేసింది.