సమ్మర్ అలర్ట్ : తెలంగాణలో 7, ఏపీలో 4 జిల్లాల్లో మంటలే

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 04:12 AM IST
సమ్మర్ అలర్ట్ : తెలంగాణలో 7, ఏపీలో 4 జిల్లాల్లో మంటలే

ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అన్నారు. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశం ఉందన్నారు. వాయవ్య దిశ నుంచి వీచే గాలుల కారణంగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 7 జిల్లాల్లో, ఏపీలోని 4 జిల్లాల్లో సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మండిపోనున్నాయని చెప్పారు. ఏపీలోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. వడగాలుల తీవ్రత సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఆ ప్రభావం గతానికన్నా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని.. సాధారణ ఉష్ణోగ్రతలను దాటి 0.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఐదేళ్ల కాలాన్ని పరిశీలించినా తెలంగాణ, ఏపీలోని జిల్లాల్లోనే అత్యధిక మరణాలు సంభవించాయి. దీంతో ఈ ఏడాది కూడా అప్రమత్తత తప్పనిసరి అని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది.

ప్రతి వేసవిలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించే నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 38 డిగ్రీల సెల్సియస్‌ దాటింది. భౌగోళిక పరిస్థితులు, గాలులు వీచే స్థితి కారణంగా రాష్ట్రంలో ఉమ్మడి 7 జిల్లాల్లో ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.

పలు జిల్లాల్లో ఆదివారం(మార్చి-3-2019) ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలను దాటాయి. నిజామాబాద్‌లో 38.2 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా వనపర్తి, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న 3 రోజులూ పొడి వాతావరణంతోపాటు ఎండ తీవ్రత కనిపించే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. ఎండల తీవ్రత దృష్ట్యా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి పెట్టారు. హీట్‌ వేవ్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించనున్నారు.