ఠాగూర్ కుర్చీలో నేను కూర్చోలేదు: అమిత్ షా

ఠాగూర్ కుర్చీలో నేను కూర్చోలేదు: అమిత్ షా

Amit Shah:విశ్వభారతి యూనివర్సీటీని సందర్శించిన సమయంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుర్చీలో కూర్చున్నానంటూ తనపై వచ్చిన ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ సభాపతి ముందు చెప్పారు. వాటిని మంగళవారం లోక్‌సభకు తీసుకొచ్చి సభ ముందు ఉంచడానికి సభాపతి పర్మిషన్ అడిగారు.

‘నేనెక్కడ కూర్చున్నానో తెలుసుకునేందుకు విశ్వభారతి వైస్‌ ఛాన్స్‌లర్‌ను ఓ రిపోర్టు కోరాను. ఆ ఫొటోలు, వీడియోలను ఓ సారి చూసి ఠాగూర్‌ సీట్లోనే కూర్చున్నానో.. లేదో చెప్పండి’ అని అమిత్‌ షా కన్ఫర్మేషన్ కోరారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కూర్చున్న విండో సీట్‌లోనే తానూ కూర్చున్నానని వివరించారు.

పర్యటకులు కూర్చొనే అవకాశం ఉందని గుర్తు చేశారు. సభలో మాట్లాడేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని మిగిలిన సభ్యులకు సూచించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడానికి… అధీర్‌ పార్టీ నేపథ్యమే కారణమని ఆరోపించారు. ఆ తర్వాత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుర్చీలో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కూర్చున్న ఫొటోలను సభలో చూపించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాపై అధీర్‌ చేసిన ఆరోపణలనూ ఆయన తిప్పికొట్టారు.

బెంగాల్‌ పర్యటన సందర్బంగా.. శాంతినికేతన్‌లోని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుర్చీలో కేంద్ర మంత్రి అమిత్‌ షా కూర్చున్నారని కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి సోమవారం లోక్‌సభలో ఆరోపించగా దీనిపై దుమారం చెలరేగింది.