18 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక్క శిశువు కూడా పుట్టలేదు..!!

  • Published By: veegamteam ,Published On : December 24, 2019 / 10:47 AM IST
18 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక్క శిశువు కూడా పుట్టలేదు..!!

జపాన్ లో జనాభా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే నాగోరో అనే గ్రామంలో అయితే గత 18 సంవత్సరాల నుంచి ఒక్క బిడ్డ అంటే ఒక్క శిశువు కూడా పుట్టలేదు..!దీంతో ఆ గ్రామంలో ఏడు సంవత్సరాల క్రితమే అంటే 2012లో  ప్రైమరీ స్కూల్ మూసి వేయాల్సి వచ్చింది…!! ఎందుకంటే పిల్లలే లేనప్పుడు స్కూల్ ఎందుకు.

పిల్లలు లేని ఇల్లు ఇల్లే కాదంటారు. వారి సందడి..అల్లరి ముద్దుముచ్చట్లు లేకపోయే జీవితం అంతా వ్యర్థంగా అనిపిస్తుంది. భవిష్యత్తుపై ఆశలు కూడా చచ్చిపోతాయి. పిల్లల కోసం ఆ నాగోరా గ్రామస్థులు మొఖంవాచిపోయారు. పిల్లల కోసం అల్లాడిపోతున్నారు. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం వారు ఓ పనిచేస్తున్నారు. 

దీంతో నాగోరో గ్రామంలో పిల్లలు లేని లోటును మరచిపోయేందుకు ఊరంతా రకరకాల బొమ్మల్ని  పెడుతున్నారు. ఇలాగైనా సరే గ్రామంలో  వెల్లివిరుస్తుందని వారు భావిస్తున్నారు. స్కూల్లో  విద్యార్థులు కూర్చోవలసిన చోట బొమ్మలను పెడుతున్నారు. 

నాగోరా గ్రామానికి చెందిన అయానో అనే 70 సంవత్సరాల మహిళ మాట్లాడుతూ ‘గ్రామంలోని ఏ ఇంటిలోనూ చాలా కాలంగా పిల్లలు పుట్టడం లేదు. అందుకే గత ఏడేళ్లుగా డాల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. గ్రామంలోని యువతీ యువకులు ఉపాధి కోసం పట్టణాలకు తరలిపోతుండటంతో, వృద్ధులు గ్రామంలో ఉంటున్నారు. వారంతా గ్రామంలో పిల్లల కేరింతలు వినాలని తెగ ఆరాటపడుతున్నారని’ తెలిపారు. ఇక్కడ యువతకు ఎటువంటి పనులు లేవని అందుకే పట్టణాలకు వెళ్లిపోతున్నారనీ..అందుకే మా గ్రామంలో పిల్లలు పుట్టని గ్రామంగా మారిపోయిందని అయానో వాపోయారు. 

యువత బతకటానికి ఎటువంటి అవకాశాలు లేకపోవటమే కాదు..నాగోరాలో ఓ మెడికల్ క్లినిక్ కూడా లేదు. ఓ కిరాణా షాప్ కూడా లేదు. నాగోరాలో 24మంది పెద్దలు మాత్రమే ఉన్నారట. మేము బతికున్న జీవచ్ఛవాలం అంటూ గ్రామస్థులు వాపోతున్నారు. 

ఈ జీవచ్ఛవాల జీవితంలో కొద్దిపాటి ఆనందం కోసం అయానో ఆమె స్నేహితురాలు కలిసి 350 బొమ్మల్ని తయారు చేసారు. వాటిని నాగోరో గ్రామం అంతా పెడ్డుతున్నారు. పాత బట్టలు,పాత న్యూస్ పేపర్లతో తయారు చేసిన బొమ్మల్ని గ్రామంలో పలు చోట్ల..మూసి వేసిన స్కూల్లోను పెడుతున్నారు. అదే డాల్ ఫెస్టివల్. ఆ బొమ్మలే వారి జీవితాల్లో పిల్లలు.