Viral Video : చదరంగం ఆడుతున్న బాలుడి వేలు విరిచిన రోబో

చదరంగం ఆడుతున్న బాలుడి వేలిని రోబో విరిచింది. దీంతో బాలుడి చేతికి గాయం అయ్యింది.

Viral Video : చదరంగం ఆడుతున్న బాలుడి వేలు విరిచిన రోబో

Chess Robot

Updated On : July 24, 2022 / 9:08 PM IST

Viral Video : చదరంగం ఆడుతున్న బాలుడి వేలిని రోబో విరిచింది. దీంతో బాలుడి చేతికి గాయం అయ్యింది. రష్యా రాజధాని మాస్కోలో ఈ ఘటన చోటు చేసుకుంది. రష్యాలో నిర్వహించిన మాస్కో చెస్ ఓపెన్ టోర్నమెంట్ లో క్రిస్టోఫర్ అనే ఏడేళ్ల బాలుడు రోబోతో చెస్ ఆడుతున్నాడు.

ఆటలో భాగంగా రోబో వంతు పావు కదపడం పూర్తి కాకుండానే బాలుడు చెస్ బోర్డుపై చేయిపెట్టటంతో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా చెస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు సెర్గే స్మాగిన్ తెలిపారు.  రోబో బాలుడి  వేలును నొక్కటం చూసి ముగ్గురు వ్యక్తులు వెంటనే అక్కడకు పరిగెత్తుకు  వచ్చారు. బాలుడి చూపుడు వేలుని   చెస్ రోబో పట్టునుంచి విడిపించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో క్రిస్టోఫర్ వేలికి గాయం  అయ్యింది. క్రిస్టోఫర్ ను వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లి విరిగిన వేలుకు కట్టు కట్టించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వీడియో ప్రకారం ఆటలో భాగంగా రోబో బాలుడి పావును తొలగించి అక్కడ తన పావును పెట్టేందుకు ప్రయత్నించింది.

ఈ ప్రక్రియ పూర్తవకముందే బాలుడు వేగంగా తన పావును కదిపాడు. ఈక్రమంలోనే అతని చేతి వేళ్లు రోబో  కింద ఇరుక్కు పోయి నలిగిపోయాయి.  మాస్కోలో 9 ఏళ్ల లోపు 30 మంది పేరు  పొందిన చెస్ ఆటగాళ్లలో క్రిస్టోఫర్ ఒకడు. ఇది  చాలా అరుదైన కేసు అని… రోబో వంతు పావు  కదపడం పూర్తయ్యేంత  వరకు వేచి ఉండాల్సిన విషయాన్ని అతను గమనించలేదని సెర్గే స్మాగిన్ పేర్కోన్నారు.