జపాన్‌లో భూకంపం.. సునామీ సమస్య లేదు

జపాన్‌లో భూకంపం.. సునామీ సమస్య లేదు

Earthquake in Japan: జపాన్ సముద్రతీరంలో శనివారం సంభవించిన భూకంపంతో హడలెత్తిపోయారు. రెక్టార్ స్కేలుపై 7.3గా నమోదైన భూప్రకంపనలకు మళ్లీ సునామీ వస్తోందేమోననే భయం జనాన్ని వణికించింది. జపాన్‌ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్‌ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. మియాగి, ఫుకుషిమా తదితర ప్రాంతాలను బలంగా తాకాయి. టోక్యో నుంచి నైరుతి ప్రాంతం వరకూ ప్రభావం కనిపించింది. కొద్ది చోట్ల గోడలు కూలినా, ప్రాణ నష్టమేమీ సంభవించలేదని, పలువురు గాయపడినట్టు మాత్రం రిపోర్టులు అందాయని అధికారులు వెల్లడించారు.

తాజా పరిణామంతో సుమారు 8.6 లక్షల గృహాలకు ఎలక్ట్రిసిటీ నిలిచిపోయిందని, ఈశాన్య ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి సునామీ హెచ్చరికలనూ జారీ చేయలేదు.

భూకంప లేఖినిపై మొదట 7.1గా నమోదైన తీవ్రత ఆ తర్వాత 7.3కు పెరిగింది. ఫుకుషిమాలోని న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఏం సమస్యా ఎదురు కాలేదని అధికారులు వెల్లడించారు. పదేళ్ల కిందట సంభవించిన సునామీకి అప్పట్లో తీవ్రంగా దెబ్బతింది. ఇదే ప్రాంతంలో ఇతర అణు కర్మాగారాలనూ పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావానికి సునామీ సంభవించే పరిస్థితేమీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల వరకూ బలమైన భూప్రకంపనలు సంభవించొచ్చని, సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తక్షణ సాయం అందించేందుకు జపాన్‌ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నారు. పలు వార్తాల చానళ్లలో భూకంపం కారణంగా పెచ్చులూడిన ఇళ్లు కనిపించాయి.