Ship stranded in Suez: వేల కోట్ల నష్టం.. కంటైనర్లు దించాకే షిప్ కదిలేది

వేల కోట్ల నష్టం తప్పడం లేదు. అది చాలదన్నట్లు సమయం గడిచిపోతూనే ఉంది. ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువ వద్ద చిక్కుకున్న భారీ నౌకను తప్పించడం సాధ్యం కావడం లేదు. పైగా ఈ నౌకలో మొత్తం..

Ship stranded in Suez: వేల కోట్ల నష్టం.. కంటైనర్లు దించాకే షిప్ కదిలేది

Suez Ship

Ship stranded in Suez: వేల కోట్ల నష్టం తప్పడం లేదు. అది చాలదన్నట్లు సమయం గడిచిపోతూనే ఉంది. ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువ వద్ద చిక్కుకున్న భారీ నౌకను తప్పించడం సాధ్యం కావడం లేదు. పైగా ఈ నౌకలో మొత్తం సిబ్బంది అంతా భారతీయులే.. ఈ ‘ఎవర్‌ గివెన్‌’ ఓడలో 25 మంది పనిచేస్తున్నారని, వారంతా క్షేమంగానే ఉన్నారని.. నిర్వహణ సంస్థ ఎవర్‌గ్రీన్‌ మెరైన్‌ వెల్లడించింది.

నౌక మట్టిలో కూరుకుపోయిన కారణంగా గంటకు సుమారు రూ.2వేల 896 కోట్ల వ్యాపారంపై ప్రభావం పడుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. అధిక బరువు కారణంగా నౌకను కదల్చడం కష్టంగా మారింది. దీంతో బడా నౌకాయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నాయి.

ఐరోపా, ఆసియాలను కలిపే సూయిజ్‌ కాలువ పొడవు 193 కిలోమీటర్లు. ఈ కీలక జలమార్గాన్ని 1859-69 మధ్య కాలంలో ఏర్పాటు చేశారు. ఇక్కడే ఎవర్‌ గివెన్‌ ఇరుక్కుపోవడంతో వరల్డ్ బిజినెస్‌పై ప్రభావం చూపుతోంది. రెండు వైపులా నిత్యం 9.6 బిలియన్‌ డాలర్ల విలువైన సరకులు, చమురు, గ్యాస్‌ రవాణా అవుతుంటాయి.

ఈ లెక్కన గంటకు సగటున 400 మిలియన్‌ డాలర్ల (రూ.2,896 కోట్ల) విలువైన సరుకులను తరలిస్తారు. ఎవర్‌ గివెన్‌ చిక్కుకున్న కారణంగా… ఇక్కడ మరో 160 నౌకలు కూడా నిలిచిపోయాయి. వీటిలో 41 భారీ ఓడలు కాగా, 24 చమురును తరలిస్తున్నవి. కాలువ వద్ద జరిగే ఒక్కరోజు ఆలస్యాన్ని అధిగమించాలంటే ఆ తర్వాత రెండు రోజులు అదనంగా కృషి చేయాల్సి ఉంటుందని రవాణా రంగ నిపుణులు అలెన్‌ బేర్‌ పేర్కొన్నారు.

ఎవర్‌ గివెన్‌లో ఉన్న సుమారు 20 వేల కంటైనర్లను దింపేసిన తర్వాత నౌకను కదిలించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు కొన్ని రోజులు లేదా వారాల సమయం పట్టేలా ఉంది. చమురు రవాణాలో కంటైనర్‌ నౌకలదే కీలక పాత్ర. ప్రస్తుతం చమురు నింపుకొన్న పలు నౌకలు సూయిజ్‌ కాలువ వద్ద నిలిచిపోయాయి. ఫలితంగా ఐరోపా దేశాలకు పెట్రోలియం ఉత్పతుల సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చని చెబుతున్నారు.

4 అంశాలతో భారత్‌ ప్రణాళిక..
కాలువ వద్ద నౌక చిక్కుకున్న నేపథ్యంలో ప్రభావం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం 4 అంశాలతో ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు వాణిజ్యశాఖకు చెందిన లాజిస్టిక్‌ విభాగం పలు శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కార్గోకు ప్రాధాన్యమివ్వడం, ధరలను మార్చడం, రేవులకు సమాచారం ఇవ్వడం, నౌకల దారి మళ్లించడం అనే అంశాలతో అధికారులు ప్రణాళికను రెడీ చేశారు.