Kishan Reddy : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్ చెప్పాలి : కిషన్ రెడ్డి

బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ.. తొలగించే పార్టీ కాదన్నారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీలుగా మారుస్తున్నారని, దీనివల్ల బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా ? అని ప్రశ్నించారు.

Kishan Reddy : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్ చెప్పాలి : కిషన్ రెడ్డి

Kishan Reddy Comments

Kishan Reddy : కాంగ్రెస్ బ్రిటిష్ వారసత్వాన్ని.. బ్రిటిష్ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం (ఏప్రిల్ 26న) ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ.. తొలగించే పార్టీ కాదన్నారు.

Read Also : ఈటల అన్నా.. మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. మల్లారెడ్డి కామెంట్స్!

ముస్లింలను తీసుకొచ్చి బీసీలుగా మారుస్తున్నారని, దీనివల్ల బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా ? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీపై మతిభ్రమించి మాట్లాడుతున్నారా? లేదా మదమెక్కి మాట్లాడుతున్నారా? అంటూ మండిపడ్డారు.

ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ రద్దు చేస్తాం :
హైదరాబాద్‌లో బీసీలు లేరా? వారు కార్పొరేటర్లు కావద్దా? అని మరోమారు సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్, ఎంఐఎం బీసీ సీట్లను ముస్లింలకు కేటాయించిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేశాక రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై మాట్లాడాలన్నారు. ఈబీసీ రిజర్వేషన్లు తెచ్చిందని బీజేపీనేనని, అలాంటిది మేమే తొలగిస్తామా? అని మండిపడ్డారు. సిగ్గులేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లను బరా బర్ రద్దు చేస్తామన్నారు.

దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ కారణం :
బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని, అందుకే ఆమెను ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకుందని చెప్పారు. ఐఎన్సీ (INC) అంటే.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్ అని ఆరోపించారు. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అంటూ కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. పదేళ్ల క్రితమే ఇటలీ కాంగ్రెస్‌ను ప్రజలు వదిలించుకున్నారని, మరోసారి ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని ప్రజలు దగ్గరకు రానివ్వరని అన్నారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం వస్తే.. రిజర్వేషన్లు ఉండవని వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఇటలీ కోసం పుట్టింది.. ఇప్పుడు ఇటలీ చస్తోందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను ఏప్రాతిపదికన తీసుకొచ్చారో చెప్పాలన్నారు. జిన్నా ముస్లిం లీగ్‌లా కాంగ్రెస్ రూపాంతరం చెందిందని ఆరోపించారు. జమ్మూలోనే 42వేల మంది ప్రాణాలు బలి చేసిందని ధ్వజమెత్తారు. జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి ఆర్టికల్ 370 అమలుచేశామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసింది కాంగ్రెస్ అన్న ఆయన ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు.

బీజేపీ పక్కా లోకల్ పార్టీ.. మీది పక్కా ఇటలీ పార్టీ : 
బీజేపీ పక్కా లోకల్ పార్టీ.. మీది పక్కా ఇటలీ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు కనుచూపు మేరలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. అంబేద్కర్ బతికి ఉన్న సమయంలో, మరణం తరువాత కూడా కాంగ్రెస్ అవమానించిందని విమర్శించారు. రాహుల్ గాంధీ వయస్సు అయిపోయిందని, టీషర్టు వేసుకున్న మాత్రానా యువకుడు కాదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కేసీఆర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందామన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆయనేని విమర్శించారు. ‘కేసీఆర్.. నువ్ ఫామ్ హౌజ్‌లో ఉండిపో’ అని అన్నారు. రేవంత్ రెడ్డి.. ఒట్లు పెట్టుకుంటే ఓట్లు పడవన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తన కుర్చీ ఎక్కడ పోతుందో అని భయపడి రేవంత్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

బీజేపీలో చేరిన ముదుగంటి వెంకటశ్రీనివాసరెడ్డి
ఇదిలా ఉండగా, నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి తనయుడు ముదుగంటి వెంకటశ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరారు. ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి కిషన్ రెడ్డి ఆహ్వానించారు.

Read Also : 10Tv Conclave : మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలకు మేలు చేయటమే నా లక్ష్యం- కొల్లు రవీంద్ర