Taiwan Vs China : చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరిగితే మిగతా దేశాలపై ప్రభావం ఎలా ఉంటుంది?

తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా..మధ్యలో అమెరికా జోక్యం చేసుకుంటే సహించేది లేదు అంటూ అత్యంత భయానకమైన మిస్సైల్ తో వార్నింగ్ కూడా ఇచ్చింది. మరి చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరిగితే మిగతా దేశాలపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది?

Taiwan Vs China : చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరిగితే మిగతా దేశాలపై ప్రభావం ఎలా ఉంటుంది?

Taiwan Vs China : తైవాన్‌ తమ భూభాగమే అంటూ చైనా పాడిన పాటే పదేపదే పాడుతోంది. అశలు ఇందులో నిజం ఎంత? తైవాన్‌పై యుద్ధం చేయాలని అనుకుంటే.. అది చైనాకు పెద్ద మ్యాటర్‌ కాదు. ఎప్పుడు బెదిరింపులే తప్ప.. యుద్ధానికి దిగింది లేదు. తైవాన్‌కు ఉన్న ఆ సపోర్టుతోనే చైనా ఆలోచనలో పడుతోందా.. అసలు చైనాలో తైవాన్ నిజంగా భాగమేనా.. చైనా, తైవాన్ యుద్ధం వస్తే ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది..

దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్. 1949నాటి సివిల్ వార్ సమయంలో చైనా, తైవాన్ విడిపోయాయ్. ఐనా సరే తైవాన్‌ను కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా.. చైనా మాత్రం తన బలాన్ని ఉపయోగించి ప్రపంచ దేశాలు దాన్ని గుర్తించకుండా అడ్డుపడుతోంది. చివరకు అంతర్జాతీయ క్రీడావేదికలపైనా తైవాన్ పేరును గానీ, రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరును గానీ వాడడానికి అంగీకరించడం లేదు చైనా. అందుకే.. తైవాన్ ప్లేయర్లంతా చైనీస్‌ తైపీ అనే పేరుతోనే ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొంటున్నారు.

వాస్తవానికి ఒకప్పుడు తైవాన్‌ చైనాను పాలించిన క్వింగ్‌ వంశస్థుల చేతిలో ఉండేది. ఐతే 1895లో జరిగిన యుద్ధంలో ఓడిపోవడంతో.. తైవాన్‌ ద్వీపాన్ని జపాన్‌కు అప్పగించారు అప్పటి చైనా పాలకులు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. తైవాన్‌పై నియంత్రణను జపాన్ వదులుకుంది. ఆ తర్వాత 1949 సివిల్‌ వార్‌లో నేషనలిస్టు ప్రభుత్వాన్ని కూల్చారు చైనా కమ్మూనిస్ట్‌ పార్టీ నేతలు. దీంతో నేషనలిస్ట్ నేతలు తైవాన్‌కు పారిపోయి.. అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక జెండాను, కరెన్సీని రూపొందించుకుని స్వతంత్రంగా పాలిస్తున్నారు. కానీ.. చైనా కమ్యూనిస్టు పార్టీ మాత్రం దాన్ని గుర్తించలేదు.. తైవాన్‌ ఎప్పటికీ చైనాలో భాగమేనంటూ చెప్పుకుంటూ వచ్చింది. చాలాకాలంగా తైవాన్ విషయంలో మౌనంగా ఉన్న చైనా.. జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టాక తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే తైవాన్‌లో ఆందోళన పెంచుతోంది.

Also read : China: చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం.. తైవాన్ ర‌క్ష‌ణ శాఖ వెబ్‌సైట్ హ్యాక్

యుద్ధానికి సిద్ధమని చైనా ఇప్పుడు కాలు దువ్వుతోంది. ఐతే చైనాలాంటి దేశం.. తైవాన్ మీద యుద్ధానికి దిగితే.. ఆ చిన్న దేశం నిజంగా తట్టుకోలేదు. సైన్యం, ఆయుధ సంపత్తి విషయంలో డ్రాగన్‌కు తైవాన్‌ ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. చైనాకు 20లక్షలకు పైగా యాక్టివ్‌ బలగాలు ఉంటే.. తైవాన్‌కు లక్షా 69వేల మంది మాత్రమే ఉన్నారు. చైనాకు పదాతి దళం 9.65 లక్షలు ఉంటే.. తైవాన్‌కు 94వేల మంది మాత్రమే ఉన్నారు. చైనాకు 2లక్షల 60వేల నేవీ దళం, 3లక్షల 95వేల ఎయిర్‌ఫోర్స్ బలగం ఉంటే.. తైవాన్‌కు నేవీ 40వేలు, ఎయిర్‌ఫోర్స్‌ 35వేల బలగం మాత్రమే ఉంది. చైనాకు 5వేల 4వందల యుద్ధ ట్యాంక్‌లు, 3వేల 227 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 59 సబ్‌మెరైన్‌లు, 9వేల 8వందలకు పైగా ఫిరంగి వాహనాలు ఉంటే.. తైవాన్‌కు 650 యుద్ధ ట్యాంక్‌లు, 504 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 4సబ్‌ మెరైన్‌లు, 2వేల ఫిరంగి వాహనాలు మాత్రమే ఉన్నాయ్. ఇలాంటి సైన్యం, ఆయుధంతో చైనాను ఢీకొట్టడం అసాధ్యం !

నిజంగా తైవాన్‌ను ఆక్రమించుకోవాలి అనుకుంటే.. చైనాకు పెద్ద మ్యాటర్‌ కాదు.. కానీ అలా చేయదు.. కేవలం బెదిరింపులకు మాత్రమే దిగుతుంది. దీనికి ప్రధాన కారణం.. తైవాన్‌కు అమెరికా, జపాన్‌ మద్దతుగా నిలవడం ! తైవాన్‌ను ఆక్రమించుకోవడానికి సిద్ధం కావడం అంటే.. కేవలం తైవాన్‌తో యుద్ధం మాత్రమే కాదు.. యూఎస్‌, జపాన్‌తోనూ యుద్ధం చేయాల్సి ఉంటుందని చైనాకు తెలుసు. ఇవన్నీ ఎలా ఉన్నా.. తైవాన్‌కు చైనా బలగాలు చేరుకోవాలంటే.. దాదాపు 128 కిలోమీటర్ల ఇరుకైన తైవాన్ జలసంధిని దాటాల్సి ఉంటుంది. ఈలోపు ఆ బలగాలను టార్గెట్ చేయడం పెద్ద మ్యాటరేం కాదు. తైవాన్‌లో పట్టణాలను టార్గెట్‌ చేయాలనుకున్నా.. అది రోజుల్లో పూర్తయ్యే అవకాశం లేదు. ఆ సిటీలు అంత పెద్దవి ! తైవాన్ భూభాగం మీద అడుగు పెట్టడం శత్రువుకు చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం కూడా !

Also read : Taiwan: తైవాన్ గగనతలంలోకి 27 యుద్ధ విమానాల్ని పంపిన చైనా.. పరిస్థితి ఉద్రిక్తం

తైవాన్ పశ్చిమభాగంలో చాలా నదులు, కాలువలు, ఎత్తైన కొండలు ఉంటాయ్. ఆ ప్రాంతంలో ల్యాండ్‌ కావడం చైనాకు అంత ఈజీ కాదు. తైవాన్‌కు చెందిన కొన్ని బీచ్‌ల్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నా.. తైవాన్‌కు చెందిన ఐలాండ్స్‌లో యాంటీ షిప్‌, ఎయిర్‌ ఢిఫెన్స్‌ భారీగా మోహరించి ఉన్నాయ్. ఎప్పటికప్పుడు అవి చైనా కదలికలపై కన్నేసి ఉంచుతున్నాయ్. అక్కడి పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లను ధ్వంసం చేయకుండా తైవాన్‌లోకి ఎంటర్‌ కావడం చైనాకు దాదాపు అసాధ్యం. దీనికితోడు జపాన్, యూఎస్‌ నుంచి డైరెక్ట్‌ మిలటరీ సపోర్టు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగితే.. నష్టపోయేది తామే అని చైనాకు తెలుసు. అందుకే ఉడత ఊపులు ఊపుతూ బెదిరింపులకు దిగడమే తప్ప.. యుద్ధానికి దిగే అవకాశాలు చాలా తక్కువ అన్న అభిప్రాయాలు ఉన్నాయ్.

పరిస్థితులు మారిపోయి.. చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరిగితే.. ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కరోనా సంక్షోభం, రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి సమయంలో తైవాన్‌ రూపంలో మరో ముప్పు ముంచుకొచ్చే అవకాశాలు ఉంటాయ్. రష్యా, యుక్రెయిన్‌ తరహాలో రెండు దేశాలకే పరిమితం కాదు.. తైవాన్‌ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే.. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య యుద్ధంగా మారుతుంది. చైనా దాడికి దిగితే క్షిపణులను విస్తృతంగా వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల గగనతలం, సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారి ఆ ప్రభావం సరఫరా వ్యవస్థలపై ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు భారత్‌.. తైవాన్‌కు మద్దతుగా నిలిస్తే.. ఇప్పటికే చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉంది. అలాగే చైనాపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కెమికల్‌, ఫార్మా కంపెనీలపై తీవ్ర పభావం పడనుంది. అంతేకాదు.. ఇప్పటికే చిప్‌ కొరతతో అల్లాడుతున్న ప్రపంచం… మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రపంచంలోనే చిప్ మేకింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది తైవాన్. అక్కడి నుంచి ఉత్పత్తి ఆగిపోతే.. అన్ని దేశాలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మొబైల్స్‌ నుంచి కార్ల వరకూ అన్నింటి తయారీపైనా ప్రభావం పడుతుంది. అందుకే.. చైనా, తైవాన్ మధ్య యుద్ధం.. ప్రపంచానికి ఏ మాత్రం మంచిది కాదు.