Antarctic Bill-2022 : అంటార్కిటికా మీద కన్నేసిన చైనా‌..మంచుఖండాన్ని కాపాడటానికి భారత్‌ కీలక నిర్ణయం

పక్క దేశాలపై పెత్తనం చెలాయించాలనుకునే చైనా కన్ను ఇప్పుడు మంచుఖండం అంటార్కిటికా మీద పడింది. మంచు ఖండాన్ని కాపాడటానికి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.

Antarctic Bill-2022 : అంటార్కిటికా మీద కన్నేసిన చైనా‌..మంచుఖండాన్ని కాపాడటానికి భారత్‌ కీలక నిర్ణయం

Indian Antarctic Bill..2022

Indian Antarctic Bill..2022 : పక్క దేశాలపై పెత్తనం చెలాయించటానికి చైనా చేసే యత్నాలు అన్నీ ఇన్నీకావు. ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నా.. ఏమాత్రం తగ్గటంలేదు డ్రాగన్ దేశం. ఇప్పుడు తాజాగా చైనా కన్ను మంచు ఖండం అంటార్కిటికా మీద పడింది.. కానీ చైనా యత్నాలు అడ్డుకునేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.  చైనా దూకుడుకు కళ్లం వేయడంతో పాటు.. అంటార్కిటికాను కాపాడేలా భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలక బిల్లుకు భారత పార్లమెంట్ సభ ఆమోదం తెలిపింది. ఇంతకీ ఆ బిల్లులో ఏముంది.. చైనాకు దూకుడుకు ఎలా బ్రేకులు పడబోతున్నాయో తెలుసుకుందాం..

మంచు ఖండాలు ప్రశాతంగా ఉన్నంత వరకే.. మానవ జాతికి మనుగడ ఉండేది ! పూర్తిగా కరిగిపోయిన రోజు.. అదే మానవజాతికి చివరిరోజు ! అలాంటిది గ్లోబల్‌ వార్మింగ్ కారణంగా.. మంచు కొండలు కరిగిపోతున్నాయ్. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయ్. కరుగుతున్న ప్రతీ మంచు కొండ.. మానవాళికి ముప్పును మోసుకొస్తోంది. మొన్నటికి మొన్న రోమ్ నగరం అంత విస్తీర్ణం ఉన్న మంచు పలక కరిగిపోయినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. అంటార్కిటికాతో పాటు ఆర్కిటిక్ ఖండంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయ్. ఇలానే మంచు కరుగుతూ పోతే మానవాళికి ప్రమాదం అని గుర్తించిన దేశాలు.. ఆ రెండు ఖండాలను కాపాడేందుకు చేయి చేయి కలుపుతున్నాయ్. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నాయ్. ఒక్క చైనా తప్ప ! దిక్కుమాలిన ఆలోచనలు, వేషాలతో.. పరిస్థితిని డ్రాగన్ మరింత ప్రమాదకరంగా మార్చే ప్రయత్నం చేస్తుండగా.. దాన్ని అడ్డుకునేలా భారత్‌ కీలక అడుగు వేసింది.

అంటార్కిటిక్‌ బిల్లుకు భారత పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంటార్కిటికా ప్రాంతంలో భారత్‌ ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాలు, నిర్వహణకు సంబంధించిన చట్టాల కొనసాగింపుపై ఇండియన్‌ అంటార్కిటిక్‌ బిల్లు 2022ను లోక్‌సభ ఆమోదించింది. అంటార్కిటిక్‌ ప్రాంతంలో మైత్రి, భారతి పేరుతో.. భారత్‌ రెండు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా దేశం నుంచి వేరే ఇతర సంస్థలు… అంటార్కిటిక్‌లో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయకుండా బిల్లు నిరోధిస్తుంది. మంచు పర్వతాలు కరుగుతూ టెన్షన్‌ పుట్టిస్తున్న వేళ.. అంటార్కిటికా పర్యావణాన్ని కాపాడేందుకు ఈ బిల్లు ఉపయోగపడబోతోంది. అంటార్కిటికాలో మైనింగ్‌తో పాటు న్యూక్లియర్‌ టెస్టుల్లాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలను నిరోధిస్తుంది. ఈ బిల్లుతో ఒక రకంగా చైనా దూకుడు కళ్లెం వేయడం ఖాయం.

1961లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అంటార్కిటికా దక్షిణ ధృవాన్ని శాంతియుతంగా.. సైంటిఫిక్‌ పరీక్షల కోసమే ఉపయోగించాలి. ఇక్కడ అణు పరీక్షల నిర్వహణనూ నిషేధించారు. సైనిక పరమైన చర్యలపైనా ఆంక్షలు విధించారు. కేవలం పరిశోధనల కోసమే అనుమతిస్తారు. ఐతే ఇక్కడే చైనా తన దొంగబుద్ది చూపిస్తోంది. దక్షిణ ధృవంపై కన్నేసి.. అక్కడి అరుదైన మత్స్య సంపద కొల్లగొట్టే ప్రయత్నం చేయడమే కాకుండా.. టూరిజం అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇక దీంతో పాటు అంటార్కిటికా తూర్పు ప్రాంతంతో పాటు.. దక్షిణ ధృవంపై డ్రోన్లను ఎగురవేసిన చైనా.. సర్వే నిర్వహించింది. మైనింగ్ చేయడం కోసమే చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆస్ట్రేలియా ఆరోపణలు చేస్తోంది. దురాక్రమణ ఆశతో.. పక్క దేశాలను ఇబ్బంది పెడుతున్న చైనా.. ఇప్పుడు మంచు ఖండంపై కన్నేసి.. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది.

అంటార్కిటికాలో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసి.. మొదట్లో సైలెంట్‌గానే కనిపించిన చైనా.. ఆ తర్వాత అసలు బుద్ది చూపించడం మొదలుపెట్టింది. అంటార్కిటికాలోని జోంగ్‌షాన్ స్టేషన్‌ ప్రాంతంలో ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మించాలని ప్లాన్ చేసింది. దీన్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తీవ్రంగా వ్యతిరేకించాయ్. అదే జరిగితే అంటార్కిటికా పర్యావరణ సమతుల్యంపై ప్రభావం పడుతుందన్న పర్యావరణవేత్త డిమాండ్‌తో చైనా వెనక్కి తగ్గింది. ఐతే 1961 ఒప్పందం ప్రకారం… అంటార్కిటికాపై తనకు చెందిన ప్రాంతం నుంచి చైనా తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదే ఆస్ట్రేలియాకు కోపం తెప్పిస్తోంది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు.. అంటార్కిటికాలో ప్రయోగాల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం 570 మిలియన్ డాలర్లు కేటాయించింది. గ్లేసియర్స్, మెరైన్‌ పరీక్షలు నిర్వహించబోతోంది. ఇది ఇప్పుడు డ్రాగన్‌ జీర్ణించుకోలేకపోతోంది.

ఆస్ట్రేలియాతో పాటు.. భారత్ కూడా ఇప్పుడు అంటార్కిటికా బిల్లుకు ఆమోదం తెలపడం.. చైనా దూకుడుకు ఒక రకంగా బ్రేకులు వేసినట్లే ! అంటార్కిటికాలో వాతావరణం రోజురోజుకు మారిపోతోంది. వాతావరణంలోని మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్ కారణంగా.. గ్లేసియర్స్ కరిగిపోతున్నాయ్. ఇలాంటి సమయంల మంచు ఖండాలను కాపాడాలని.. వివిధ దేశాలు పారిస్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయ్. అందులో భాగంగానే ఓ అడుగు ముందుకు వేస్తూ.. భారత్‌ బిల్లు తీసుకువచ్చింది. అంటార్కిటికా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు.. ఇది ఒకరకంగా డ్రాగన్ ఓవరాక్షన్‌కు చెక్‌ పెట్టినట్లే అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.