ధూమ్‌ 2 సినిమా సీన్‌ను మించి దోపిడీ.. ప్రఖ్యాత మ్యూజియంలో 7 నిమిషాల్లో చోరీ.. నెపోలియన్‌ కాలంనాటి ఆ ఆభరణాలను ఇక చూడలేం..

దొంగలు ముందే ప్లాన్‌ వేసుకొని, హైడ్రాలిక్ ల్యాడర్‌తో మ్యూజియంలోకి ప్రవేశించి, కిటికీ గాజులను “డిస్క్ కట్టర్”తో కత్తిరించి, రత్నాలు తీసుకొని పారిపోయారు.

ధూమ్‌ 2 సినిమా సీన్‌ను మించి దోపిడీ.. ప్రఖ్యాత మ్యూజియంలో 7 నిమిషాల్లో చోరీ.. నెపోలియన్‌ కాలంనాటి ఆ ఆభరణాలను ఇక చూడలేం..

Updated On : October 19, 2025 / 8:30 PM IST

Louvre: ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో ఇవాళ తెల్లవారుజామున నెపోలియం కాలం నాటి ఆభరణాల చోరీ జరిగింది. దీంతో ఆ మ్యూజియాన్ని ఇవాళ మూసేశారు. ఈ మ్యూజియాన్ని ప్రతిరోజు దాదాపు 30 వేల మంది సందర్శిస్తారు. ఈ ఐకానిక్ మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాత, చారిత్రక వస్తువులుంటాయి. మోనాలీసా ఒరిజినల్ చిత్రం కూడా ఇక్కడే ఉంటుంది.

ఆ మ్యూజియంలో చోరీ జరిగిందని ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ మంత్రి లోరెంట్ నూనెజ్ చెప్పారు. దొంగలు హైడ్రాలిక్ ల్యాడెర్‌ను ఉపయోగించి మ్యూజియంలోకి ప్రవేశించి అమూల్యమైన ఆభరణాలను దోచుకున్నారని తెలిపారు. (Louvre)

సేన్ నది వైపుగా ముఖభాగం ఉండేలా ఇక్కడ ఓ భవన నిర్మాణం జరుగుతోందని, దాని నుంచే దొంగలు మ్యూజియంలోకి చొరబడ్డారని, వారు అపోలో గ్యాలరీకి చేరుకున్నారని తెలిపారు. అపోలో గ్యాలరీలో ఆ సమయంలో ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ ను ప్రదర్శిస్తున్నారు. అంటే, ఇవి ఫ్రెంచ్ రాజవంశపు కిరీట ఆభరణాలు.

Also Read: షాకింగ్‌.. తలుపుని బద్దలుకొట్టి తుపాకులతో వచ్చిన పోలీసులు.. ఏడ్చిన చిన్నారి..

దొంగలు “డిస్క్ కట్టర్” ఉపయోగించి కిటికీలను కత్తిరించి వచ్చారని నూనెజ్ చెప్పారు. కేవలం 7 నిమిషాల్లో చోరీ చేసి పారిపోయారని వివరించారు. ముందుగానే ప్లాన్‌ వేసుకుని ఈ చోరీ చేసినట్లు అనిపిస్తోందని అన్నారు.

నెపోలియన్, ఎంప్రెస్ ఆభరణాల సేకరణలోని 9 రత్నాలను దొంగలు చోరీ చేశారని, వీటిలో ఒక రత్నం మ్యూజియం బయట దొరికిందని అన్నారు. దొంగలు చోరీ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఒక్క రత్నం బయట పడిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చోరీపై ఆ మ్యూజియం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ చోరీపై ప్యారిస్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ దర్యాప్తు ప్రారంభించింది.

ఈ మ్యూజియంలో 33,000 పైగా కళాఖండాలు (చారిత్రక వస్తువులు, శిల్పాలు, చిత్రాలు) ఉంటాయి. ప్రధాన ఆకర్షణ మోనా లీసా చిత్రానిది. ఈ మ్యూజియంలో గతంలోనూ పలుసార్లు దొంగతనాలు జరిగాయి. లియోనార్డో డా విన్చీ చిత్రాన్ని 1911లో వెంకెంజో పెరూజ్జియా అనే కార్మికుడు మ్యూజియం నుంచి తీసి తన కోట్లో దాచుకొని తీసుకెళ్లాడు.

రెండు సంవత్సరాల తరువాత ఇటలీ ఫ్లోరెన్స్ లో అది తిరిగి లభించింది. చివరిసారిగా ఈ మ్యూజియంలో 1983లో భారీ చోరీ జరిగింది. రెనైసాన్స్‌ కాలపు రెండు వాల్డ్-ఆర్మర్ ను మ్యూజియం నుంచి చోరీ చేశారు. ఈ వస్తువులు 2021లో తిరిగి లభించాయి.