Fridge : అదృష్టవంతుడు.. ఆన్‌లైన్‌లో కొన్న ఫ్రిడ్జ్‌లో రూ.96లక్షలు దొరికాయి

ఆన్‌లైన్‌లో కొన్న ఒక ఫ్రిడ్జి అతని ఇంట్లో లక్షలు కురిపించింది. ఏకంగా రూ.96లక్షలు దొరికాయి.

Fridge : అదృష్టవంతుడు.. ఆన్‌లైన్‌లో కొన్న ఫ్రిడ్జ్‌లో రూ.96లక్షలు దొరికాయి

Fridge Money

Fridge : డబ్బు కోసం కొందరు మనుషులు దిగజారిపోతున్నారు. తప్పుడు దారులు తొక్కుతున్నారు. మర్డర్లు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాంటి మనుషులున్న ఈ రోజుల్లో.. మనం ఏం చేయకుండా, డబ్బు దానంతట అదే వచ్చి మన ఇంట్లో చేరితే.. ఆ ఆనందానికి అవధులుండవు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి సంపాదించే డబ్బు మన ఇంటికి ఫ్రీగా వచ్చేస్తే అంతకన్నా ఇంకేం కావాలి. అలా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ అదృష్టం కోటిలో ఒక్కరిని మాత్రమే వరిస్తుంది. ఇదిగో దక్షిణ కొరియాలోని ఓ వ్యక్తికి అదృష్టం అలాగే తలుపు తట్టింది. అక్కడితో ఆగకుండా వచ్చి ఏకంగా నట్టింట్లో తిష్ట వేసింది.

ఆన్‌లైన్‌లో ఐఫోన్ బుక్ చేస్తే ఇటుక రాయి వచ్చిన ఘటనలు మనకు తెలుసు. కానీ ఆన్‌లైన్‌లో కొన్న ఒక ఫ్రిడ్జి అతని ఇంట్లో లక్షలు కురిపించింది. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో ఉన్న ఓ వ్యక్తి ఆన్‌లైన్‌‌లో ఫ్రిడ్జి ఆర్డర్ చేశాడు. కొన్ని రోజులకు ఆ ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చింది. ఇంటికి కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది కదా అని దాన్ని అతడు శుభ్రం చేయడానికి రెడీ అయ్యాడు. అదిగో అప్పుడే ఫ్రిడ్జ్ దిగువ భాగంలో అతడికి ఓ అట్టముక్క కనిపించింది. ఆ అట్టముక్క ఊడి కింద పడకుండా టేప్ వేసి ఉంది. దాంతో అతడిలో ఉత్సుకత పెరిగింది. టేపు తీసి ఆ అట్టముక్క కింద ఏముందా? అని చూశాడు. అంతే దిమ్మతిరిగిపోయింది. అక్కడ దాదాపు 1.3 లక్షల డాలర్ల డబ్బు దర్శనమిచ్చింది. అది మన లెక్కల్లో అయితే దాదాపు రూ.96 లక్షలకు సమానం.

దీంతో అతడు రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోయాడు. కానీ అతను నిజాయితీపరుడు. తనకు దొరికిన డబ్బు తనది కాదంటూ పోలీసులకు అప్పగించేశాడు. దక్షిణ కొరియాలో చట్టాల ప్రకారం, ఆ డబ్బు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే 22 శాతం పన్ను ప్రభుత్వానికి చెల్లించి మిగతా డబ్బును అతడు తీసేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరైనా ఆ డబ్బు తమదేనంటూ వస్తే అతడికి కొంత మొత్తం పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్నా అతను లక్షాధికారి అయినట్లే.

ఆ డబ్బుని అతడు ఎవరికీ చెప్పకుండా తనతోనే దాచుకున్నా ఎవరికీ విషయం తెలిసేది కాదు. కానీ ఆ వ్యక్తి అలా చెయ్యలేదు. ఎంతో నిజాయితీగా వ్యవహరించాడు. తనది కాని డబ్బు కోసం ఆశపడలేదు. అదే స్థానంలో మరొకరు ఉండి ఉంటే, కచ్చితంగా ఆ డబ్బు విషయాన్ని బయటకు చెప్పేవారు కాదేమో. అంత పెద్ద మొత్తంలో దొరికిన డబ్బుని అతడు పోలీసులకు అప్పగించడం అందరిని విస్మయానికి గురి చేసింది. అతడి మంచితనానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ అని కితాబిస్తున్నారు.