Nepal Tigers : నేపాల్ లో భారీగా పెరిగిన పులుల సంఖ్య..భయంతో వణికిపోతున్న ప్రజలు

నేపాల్ ప్రభుత్వం పులుల సంఖ్య పెంచటంలో సఫలమైంది. నేపాల్ లో పులుల సంఖ్య భారీగా పెరిగింది.పదేళ్లలో రెండింతలు..మూడింతలు పెరిగింది... పెరిగిన పులులతో ఓవైపు ఆనందం.. మరోపక్క భయం నెలకొంది. టైగర్ గాండ్రింపుతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పులుల సంఖ్య పెరగడానికి కారణమేంటి? పులిరాజాతో నేపాల్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

Nepal Tigers : నేపాల్ లో భారీగా పెరిగిన పులుల సంఖ్య..భయంతో వణికిపోతున్న ప్రజలు

Tigers Have Nearly Tripled In Nepal

Tigers have nearly tripled in Nepal  : పులిరాజా గర్జన పెరిగింది.. పదేళ్లలో రెండింతలు..మూడింతలు అయ్యాయి.. పెరిగిన పులులతో ఓవైపు ఆనందం.. మరోపక్క భయం నెలకొంది. టైగర్ గాండ్రింపుతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే ఇదంతా మనదేశంలో కాదు. పక్కనే ఉన్న నేపాల్‌లో. ఇంతకీ పులుల సంఖ్య పెరగడానికి కారణమేంటి? పులిరాజాతో నేపాల్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

నేపాల్‌లో పులుల గర్జనలు పెరిగాయి. గత పదేళ్లలో అసాధారణ రీతిలో పులుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగింది. నేపాల్ పులుల సంఖ్యను రెట్టింపు చేసిందని ప్రపంచం ఆనందిస్తోంది కానీ.. అక్కడి ప్రజల బాధలు వర్ణనాతీతం. పెరిగిన పులుల సంఖ్య నేషనల్ పార్క్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. అక్కడి స్థానికులు భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు ఎటునుంచి పులి విరుచుకుపడుతుందోనన్న టెన్షన్‌తో వణికిపోతున్నారు.

శతాబ్దం క్రితం ఆసియాలో మొత్తం సుమారు లక్ష పులులు ఉండేవి. 2000 దశాబ్దం ప్రారంభానికి ఆ సంఖ్య 95 శాతం తగ్గిపోయింది. ఆ సమయంలో వేటగాళ్లు పులులను వేటాడటంతో ఆసియా వ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పులి జాతి అంతరించిపోతుండటంతో 2010లో 13 దేశాలు పులుల సంఖ్యను పెంచేందుకు చర్చలు చేపట్టాయి. 2022 నాటికల్లా తమ దేశాల్లోని పులుల సంఖ్యను రెట్టింపు చేస్తామన్నాయి. అయితే 13 దేశాల్లో ఒక్క నేపాల్‌ ప్రభుత్వం మాత్రమే తగిన చర్యలు తీసుకుని లక్ష్యాన్ని చేరుకుంది. దాదాపు అంతరించేపోయే దశ నుంచి టైగర్స్‌ను రక్షించింది. అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించే ఉద్దేశంతో సుమారు 968 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బర్దియా ప్రాంతాన్ని 1988లో నేషనల్‌ పార్క్‌గా మార్చారు. పులుల సంఖ్య పెరిగేందుకు నేషనల్ పార్క్ అధికారులు గడ్డి భూములను విస్తరించారు.

అలాగే, పులుల ప్రధాన ఆహారం అయిన జింకలకు అనువైన ఆవాసాన్ని సృష్టించేందుకు నీటి గుంటలను సైతం ఏర్పాటు చేశారు. దీంతో నేపాల్‌లో పులుల సంఖ్య అమాంతం పెరిగింది. ఎంతలా అంటే నేపాల్‌లో 2009లో 121 పులులు ఉంటే…. 2022 నాటికి ఏకంగా 355కి పెరిగింది. పులులే కాదు… ఖడ్గమృగం, ఏనుగు, చిరుతపులి జంతువుల సంఖ్య కూడా పెరిగింది. ఇంత వరకు బాగానే ఉన్నా… నేపాల్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అక్కడి ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. పులుల దాడులు ఎక్కువై… వాటికి బలవుతున్నారు. ప్రస్తుతం ఆసియాలో సుమారు 5వేల పులులు మిగిలి ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంచనా వేసింది.

నేపాల్‌లో గ్రామస్తులు పశువులు మేపడానికి, పండ్లు, పుట్టగొడుగులు, కలపను సేకరించేందుకు నేషనల్ పార్క్‌లోకి లేదా బఫర్ జోన్లోకి వెళ్లినప్పుడు పులులు దాడులు చేస్తున్నాయి. అంతేకాదు… పులులు ఏకంగా గ్రామాల్లోకి ప్రవేశించిన సందర్భాలూ ఉన్నాయి. వన్యప్రాణులు, మనుషుల మధ్యకు రాకుండా కంచెలు వేసినప్పటికీ పులులు వాటిని దాటుకుని గ్రామల్లోకి ప్రవేశిస్తున్నాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లో ఏడాది కాలంలో 16 మంది పులి పంజాకు బలయ్యారు. అంతకుముందు అయిదేళ్లల్లో మొత్తం 10 మంది మాత్రమే పులి దాడుల్లో చనిపోయారు. అంటే పులుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ… వాటి పంజాలకు బలవుతున్నవారు ఎక్కువవుతున్నారు. దీంతో నేపాల్‌ ప్రజలు ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.