Imran Khan : తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత..??

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రాణహాని పొంచి ఉందా..? స్వదేశంలోనో, విదేశంలోనో తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఇమ్రాన్ చేసిన ఆరోపణల్లో నిజమెంత..? ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఎదురుదాడి చేసే క్రమంలోనే ఇమ్రాన్ ఈ ప్రకటన చేశారా..?

Imran Khan : తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత..??

Imran Khan Life Therat

Imran Khan life therat : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రాణహాని పొంచి ఉందా..? స్వదేశంలోనో, విదేశంలోనో తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఇమ్రాన్ చేసిన ఆరోపణల్లో నిజమెంత..? ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఎదురుదాడి చేసే క్రమంలోనే ఇమ్రాన్ ఈ ప్రకటన చేశారా..? ప్రజల మనసుల్లో ఇమ్రాన్ విషం నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రధాని షెహ్‌బాజ్ వ్యాఖ్యల అర్ధం ఏమిటి?

అవిశ్వాసతీర్మానంతో పదవి నుంచి దిగిపోయిన పాకిస్తాన్ తొలి ప్రధానిగా చరిత్రకెక్కిన ఇమ్రాన్ అప్పటినుంచి ఏదో ఓ రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇమ్రాన్ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఆయన్ను జైలుకు పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంటే..ఇమ్రాన్ ఎదరుదాడి వ్యూహం ఎంచుకున్నారు. పదవి నుంచి దిగిపోయిన దగ్గర నుంచి ర్యాలీలు, సభలు పేరుతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్న ఇమ్రాన్ ఈ నెల 20న 20లక్షల మందితో ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 20 లక్షలమందితో తాను ఇస్లామాబాద్‌లో ప్రవేశించకుండా ఏ శక్తీ తనను అడ్డుకోలేదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇంపోర్టెడ్ గవర్నమెంట్ అని పిలుస్తున్న ఇమ్రాన్…తాను నిర్వహించబోయ మార్చ్ షెహబాజ్ షరీఫ్‌ను పదవి నుంచి తొలగించే విప్లవమని అభివర్ణించారు.

షెహబాజ్ షరీఫ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇమ్రాన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వెనక, తన ప్రభుత్వాన్ని కూల్చివేయడం వెనక అమెరికా కుట్ర ఉందని ఇమ్రాన్ ఆరోపించారు. పాకిస్తాన్‌లోని ఇతర పార్టీలు అమెరికాతో కుమ్మక్కై ఆ దేశం చెప్పినట్టుగా నడుచుకుంటున్నాయని మండిపడ్డారు. యుక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా వైఖరితో పనిలేకుండా….స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబించినందుకే అగ్రరాజ్యం తనపై కక్షకట్టిందని ఆరోపించారు . అందుకే ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆయన దిగుమతి ప్రభుత్వంగా పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని దొంగల చేతిలో పెట్టడం కన్నా అణుబాంబు వేసి నాశనం చేయడం మంచిదన్నారు.

సియాల్ కోట్‌లో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీలో మరో సంచలన ఆరోపణ చేశారు ఇమ్రాన్. తనకు ప్రాణ హాని పొంచిఉందని, తనను హత్యచేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తన హత్య కుట్రకు సంబంధించిన సమస్త సమాచారం తన దగ్గర ఉందని తెలిపారు. కొన్ని రోజుల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని, ఈ హత్య కుట్రలో ప్రమేయముందన్నవారందరి పేర్లను ఓ వీడియోలో రికార్డు చేశానని ఇమ్రాన్ తెలీఇపారు. ఆ వీడియోను సురక్షిత ప్రదేశంలో ఉంచానని, తనకేమన్నా జరిగితే దేశ ప్రజలు వీడియో ద్వారా ఆ కుట్ర గురించి తెలుసుకోవాలని కోరారు.

అయితే ఇమ్రాన్ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఇమ్రాన్ ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ మండిపడ్డారు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ఇమ్రాన్ కట్టు కథలు చెబుతున్నారని పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఏం నేర్చుకోలేదని ఎద్దేవా చేశారు. తన ప్రత్యర్ధులు, అమెరికా కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నాయన్న అర్ధం వచ్చేలా ఇమ్రాన్ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, అర్ధంపర్ధం లేని వ్యాఖ్యలు చేసే ఇమ్రాన్ లాంటివారికి పాకిస్తాన్ రాజకీయాల్లో చోటులేదన్నారు.

ఇమ్రాన్ ఆరోపణలు, ప్రభుత్వ ప్రత్యారోపణలతో పాకిస్తాన్ రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దుచేసి దేశంలో తక్షణమే ఎన్నికలు జరపాలన్నది ఇమ్రాన్ డిమాండ్. షెహబాజ్ షరీఫ్‌ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఇమ్రాన్ డిమాండ్‌ నెరవేరే సూచన కనిపించడం లేదు.