UK PM Liz Truss Resigns : బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం.. ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. పదవి చేపట్టిన 45 రోజుల్లోనే

బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే పీఎం పోస్ట్ కి ఆమె రిజైన్ చేశారు.

UK PM Liz Truss Resigns : బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం.. ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. పదవి చేపట్టిన 45 రోజుల్లోనే

UK PM Liz Truss Resigns : బ్రిటన్ లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే పీఎం పోస్ట్ కి ఆమె రిజైన్ చేశారు. మినీ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు రావడంతో ప్రధాని పదవికి ఆమె రాజీనామా చేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని తాను నిలబెట్టుకోలేకపోయానన్నారు లిజ్ ట్రస్.

దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల పలువురు మంత్రులు రాజీనామా చేయగా.. తాజాగా ప్రధానికి కూడా అదే పరిస్థితి వచ్చింది. బ్రిటన్‌ చరిత్రలో అతి తక్కువ కాలం (45రోజుల) పాటు ప్రధాని పదవిలో లిజ్‌ ట్రస్‌ కొనసాగారు.

కాగా, బోరిస్ జాన్సన్ స్థానంలో లిజ్ ట్రస్ ప్రధాని పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. బాధ్యతలు తీసుకున్న 45 రోజులకే రాజీనామా చేయడం గమనార్హం. దీంతో బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు. ఇప్పటి వరకూ ఈ రికార్డు జార్జ్ కానింగ్ (119 రోజులు) పేరిట ఉండేది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జార్జ్ కానింగ్‌ క్షయ వ్యాధి బారినపడి తీవ్రం కావడంతో ఆయన మరణించారు.

పార్టీ గేట్ కుంభకోణం కారణంగా ప్రధాని పదవిని బోరిస్ జాన్సన్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ప్రధాని పదవికి ఎన్నికలు జరిగాయి. భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ పోటీ పడ్డారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా ట్రస్‌కే పట్టంకట్టడంతో ఆమె సునాయసంగా విజయం సాధించారు. సెప్టెంబర్ 5న ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అనేక సవాళ్లు, యూకే ప్రజల అచంచల విశ్వాసం మధ్య యూకే ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌లో ట్రస్ వచ్చాక పరిస్థితి మారుతుందని అంతా భావించారు. ట్రస్ సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే, లిజ్ ట్రస్ తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రస్ వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది. ఆమె ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపి పౌండ్ విలువ మరింత పడిపోయింది. అంతేకాదు ఎన్నికల ప్రచార సమయంలో ఆదాయపు పన్నులో రాయితీ ఇస్తానని చెప్పిన ట్రస్‌.. యూ టర్న్‌ తీసుకొని మాట మార్చారు. ఫలితంగా ఆమెపై తీవ్ర విమర్శలు చ్చాయి. సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ఆర్థిక మంత్రిని ఆమె స్వయంగా తప్పించారు.

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగానే ట్రస్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ విమర్శలపై రెండు రోజుల కిందట ట్రస్ స్పందిస్తూ.. పెద్ద తప్పు జరిగిపోయిందని, ఆ తప్పు చాలా దూరం వెళ్లిందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘‘జరిగిన పొరపాట్లకు క్షమించండి.. ఆర్థికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయి. ఆ పరిణామాలు అతి వేగంగా చాలాదూరం వెళ్లాయి. అందుకు నేనే బాధ్యత తీసుకుంటున్నా. కాస్త సమయం ఇవ్వండి.. అన్నీ చక్కబెడతాం’’ ప్రకటించారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ట్రస్ ను ఎన్నుకుని తప్పిదం చేశామన్న అభిప్రాయంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీలోని మెజార్టీ ఎంపీలు.. అవిశ్వాసం ద్వారా ఆమెను గద్దె దించే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆమెను పదవి నుంచి తప్పించడానికి పావులు కదుపుతున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రస్‌ తన పదవికి రాజీనామా చేసేశారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు కొత్త ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. కాగా, నాలుగేళ్ల కాలంలో బ్రిటన్‌కు నాలుగో ప్రధాని ఎన్నిక రావడం గమనార్హం.