Tornadoes : అమెరికాలోని 6 రాష్ట్రాల్లో టోర్నడో బీభత్సం..80కి పెరిగిన మృతుల సంఖ్య

అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో భీకర తుపాను(టోర్నడో)బీభత్సం సృష్టిస్తోంది. వినాశకరమైన సుడిగాలులు గర్జించాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు

Tornadoes : అమెరికాలోని 6 రాష్ట్రాల్లో టోర్నడో బీభత్సం..80కి పెరిగిన మృతుల సంఖ్య

Usa6

Tornadoes :  అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో భీకర తుపాను(టోర్నడో)బీభత్సం సృష్టిస్తోంది. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. సుడిగాలు లు బెంబేలెత్తిస్తున్నాయి.  అర్కానాస్,ఇల్లినాయిస్,కెంటకీ,మిస్సౌరి,మిస్సిసిపి,టెన్నెస్సీ రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి టోర్నడో విరుచుకుపడగా..ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 80కి చేరినట్లు అమెరికా అధికారులు అధికారికంగా ప్రకటించారు.

ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భీతావహంగా మారింది. ఒక్క కెంటకీ రాష్ట్రంలోనే పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్లో 70మంది ప్రాణాలు కోల్పోయారని కెంటకీ గవర్నర్‌ ఆండీ బెషియర్‌ శనివారం చెప్పారు.

కెంటకీ గవర్నర్‌ ఆండీ బెషియర్ మాట్లాడుతూ…”మేఫీల్డ్‌ నగరంలో ఓ క్యాండిల్‌ ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలటం వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఘటన జరిగిన సమయంలో 110 మంది ఆ ఫ్యాక్టరీలో ఉన్నారు. శుక్రవారం రాత్రి అత్యంత దుర్భరమైనది. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసింది. కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైనది. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) విధిస్తున్నాం. సహాయక చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించాం. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య 100 దాటే అవకాశం ఉంది”అని చెప్పారు. స్థానిక అధికారులు, నేషనల్‌ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్‌ మేఫీల్డ్‌ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

ఇక, కెంటకీలోని బౌలింగ్‌ గ్రీన్‌ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

ఇక,టోర్నడో బీభత్సానికి ఇల్లినోయీస్ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్‌ వేర్ హౌస్(గిడ్డంగి)ధ్వంసమైంది. అమెజాన్‌ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తుపాను హెచ్చరిక అమల్లోనే ఉంది. 100 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు సమాచారం. క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు అమెజాన్ ఉద్యోగులు మరణించినట్లు సమాచారం. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు.

మరోవైపు, అలాస్కాలో ఓ నర్సింగ్‌హోం దెబ్బతింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్పిస్తే బయటకు రావద్దని పలుచోట్ల అధికారులు విజ్ఞప్తి చేశారు. తాజా పరిస్థితిని సమీక్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్…ఇది చరిత్రలో “అతిపెద్ద” తుఫాను వ్యాప్తిగా అభివర్ణించారు.

ALSO READ Aeroplane Emergency Landing : స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్