నోట్ల కట్టలు.. ఏరులైన పారుతున్న మద్యం.. ప్రజాస్వామ్య పండుగలో ధనమే కీలకమా?

ఈసారి జరుగుతున్న సార్వత్రిక సమరంలో అయితే గోవా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు అవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.

నోట్ల కట్టలు.. ఏరులైన పారుతున్న మద్యం.. ప్రజాస్వామ్య పండుగలో ధనమే కీలకమా?

Lok Sabha election 2024: ఎన్నికలు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక పండుగ కంటే ఎక్కువ. రాబోయే ఐదేళ్లు దేశ దశాదిశను నిర్ణయించే వేదిక. ఇలాంటి ఎంతో ప్రతిష్ట కలిగిన ఎన్నికల్లో ధనం కీలక పాత్ర పోషిస్తోంది. పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక స్థోమతను కీలకంగా తీసుకుంటున్నాయి. ఈసారి జరుగుతున్న సార్వత్రిక సమరంలో అయితే గోవా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు అవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.

ఒక్కో ఓటరుకు రూ.1,400 ఖర్చు
నిపుణుల లెక్కల ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల ఖర్చు లక్షా 35వేల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యధికమని చెప్తున్నారు. అమెరికాకు చెందిన ఓపెన్‌ సీక్రెట్స్‌ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం లక్షా 2 వేల కోట్లు. ఇప్పుడు మన దగ్గరయ్యే ఖర్చు దీన్ని దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. అంటే దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది ఉండగా.. ఒక్కో ఓటరుకు రూ.1,400 ఖర్చు చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా 2019లో రూ.60 వేల కోట్లు ఖర్చు అయిందని.. ఈసారి అది రెట్టింపు అవుతుందని అంటున్నారు నిపుణులు.

సెంటర్‌ ఫర్ మీడియా స్టడీస్‌ CMS అనే స్వచ్ఛంద సంస్థ.. 35 ఏళ్లుగా ఎన్నికల ఖర్చులను పరిశీలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో భారీగా ఖర్చు కానున్నట్లు అంచనా వేస్తుంది CMS. ఈ వ్యయంలో ప్రభుత్వాలు, అభ్యర్థులు, పలు సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్నిరకాల ఎన్నికల ఖర్చులను లెక్కలోకి తీసుకున్నారు.

ఎన్నికల వ్యయం లక్షా 2 వేల కోట్లు!
ఈసారి ఎన్నికల వ్యయం లక్షా 2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేసింది CMS. అయితే.. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల సంబంధిత ఖర్చులన్నింటినీ లెక్కించడంతో.. ఈ సారి ఎలక్షన్స్‌ ఖర్చును లక్షా 35వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి మూడు, నాలుగు నెలల ముందు నుంచి పార్టీలు, అభ్యర్థులు పెట్టిన వ్యయాన్ని లెక్కలోకి తీసుకున్నారు.

Also Read: కేరళలో ఆసక్తికరంగా ట్రయాంగిల్ ఫైట్.. పట్టు సాధించేందుకు కమలం పార్టీ ఎత్తులు

ఎన్నికలకు ముందునుంచీ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో.. బహిరంగ సభలు, రవాణా, వర్కర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సహా నేతలతో బేరసారాలు వంటివీ ఇందులో భాగమే. మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఖర్చు పెట్టేది దాదాపు 10 నుంచి 15 శాతమే. ఎన్నికల వ్యయంలో వివిధ మీడియా మాద్యమాల ద్వారా పెట్టేది 30 శాతం ఉంటుంది. ఈ 45 రోజుల ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది CMS సంస్థ.