Rain Alert : ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ఉరుములు, పిడుగులతో..
Rain Alert : ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు..
Rain Alert
Rain Alert : ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ ఏడాదిలో జులై నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు సందర్భాల్లో కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వారంరోజుల క్రితం వరకు కూడా మొంథా తుపాను రూపంలో వరుణుడు ఏపీ ప్రజలను వణికించాడు. ప్రస్తుతం తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, తాజాగా.. వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. మళ్లీ వర్షాలు దంచికొడతాయని తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మూడింటిలోనూ ద్రోణులు ఉన్నాయి. అవి అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భూమధ్య రేఖ దగ్గర, అండమాన్ కు పశ్చిమంగా ఒక అల్పపీడనం ఏర్పడేలా ఉంది. అలాగే.. థాయిలాండ్ పక్కన బంగాళాఖాతంలో మరో ఆవర్తనం 6న ఏర్పడేలా కనిపిస్తోంది.. అయితే, అది అల్పపీడనంగా అవుతుందా లేదా అనేది 8న తెలుస్తోంది.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బుధ, గురు వారాల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఇవాళ (బుధవారం), కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని.. పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాలు పడే సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమై బయటకు వెళ్లినా తగిన జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఆకస్మిక వర్షాల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, అదే సమయంలో విద్యుత్ తీగలకు, స్తంభాలకు దగ్గరగా ఉండొద్దని సూచించారు.
