Ruckus in Parliament : భారత చట్టసభల్లోనే కాదు.. ఆ దేశ పార్లమెంట్లలోనూ ఇదే రచ్చ!

పార్లమెంటులో చట్టసభ సభ్యులు వాగ్వాదాలకు దిగడం సర్వసాధారణం. చర్చలకు పట్టుబట్టి సభను సజావుగా సాగనివ్వకపోవడం వంటి ఘటనలు కనిపిస్తుంటాయి.

Ruckus in Parliament : భారత చట్టసభల్లోనే కాదు.. ఆ దేశ పార్లమెంట్లలోనూ ఇదే రచ్చ!

Ruckus In Parliament Is Not Limited To India

Ruckus in Parliament : పార్లమెంటులో చట్టసభ సభ్యులు వాగ్వాదాలకు దిగడం సర్వసాధారణం. చర్చలకు పట్టుబట్టి సభను సజావుగా సాగనివ్వకపోవడం వంటి ఘటనలు కనిపిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు జరగడం కేవలం ఒక భారతీయ చట్ట సభలకే పరిమితం కాదు.. ఇతర దేశాల పార్లమెంట్లలోనూ ఇలాంటి ఘటనలే కనిపిస్తుంటాయి. ఫలితంగా సభలో సభ్యుల చర్యలతో పలుమార్లు వాయిదాలు పడుతుంటాయి. ఇప్పుడు భారత చట్ట సభల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దేశంలో సంచలనం రేపిన పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం, రైతు చట్టాలపైచర్చ జరపాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో చట్ట సభల్లో రచ్చకు దారితీసింది.

తద్వారా పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగలేదు. ప్లకార్డులు ప్రదర్శన, కాగితాలు చించడం, ఫైల్స్ లాగడం వంటి చర్యలతో సభ వాయిదాల పర్వం నడిచింది. ఈ వైఖరితో అటు లోక్సభ స్పీకర్ ఓ బిర్లా, ఇటు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని తీవ్రంగా బాధించింది. సభ్యుల చర్యలతో ఒక దశలో వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదనన్నారు. కొందరు సభ్యులు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. ఈ తరహా పరిస్థితులు కేవలం మన ఒక్క దేశానికే పరిమితం కాలేదు. పలు దేశాల చట్టసభల్లో సభ్యుల వైఖరి ఇలానే ఉందనడానికి ఈ ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు.

పాక్ జాతీయ అసెంబ్లీలో :
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగే సమయంలో ఇలాంటి ఘటనే జరిగింది. సభ్యులు వాగ్వాదానికి దిగడంతో వీధి గొడవలా మారింది. ఒకరిపై మరొకరు ఫైల్స్, పుస్తకాలు విసురుకున్నారు. కొందరు పెద్దలు ఆగమని చెప్పినా పట్టించుకోకుండా బల్లలపైకి ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బొలీవియా పార్లమెంటులోనూ :
బొలీవియా పార్లమెంటులోనూ ఇదే తరహాలో రచ్చ కొనసాగింది. పర్వత ప్రాంతాలకు, వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన బొలీవియా పార్లమెంటులో సభ్యులు తీరు పెద్దల్లో అసహనానికి దారితీసింది. 2006 నుంచి 2019 వరకు అధికారంలో కొనసాగిన ఈవో మొరాలెస్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రయత్నించారంటూ సీనియర్ పార్లమెంటేరియన్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. మొరాలెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అవినీతికి పాల్పడిందంటూ దేశవ్యాప్తంగా ఆరోపణలు రావడంతో అక్కడి చట్ట సభను కుదిపేసింది. అంతే చట్టసభ సభ్యులు స్థాయి, స్థానాన్ని మర్చిపోయి ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు.

పాన్ ఆఫ్రికా పార్లమెంట్లోలోనూ :
మే 31న పాన్ ఆఫ్రికా పార్లమెంట్ లో ఇది జరిగింది. కానీ, మరుసటి రోజు జూన్ నెలలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 235 మంది సభ్యులు గల పార్లమెంట్ కు ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలో నిర్ణయించేందుకు జరిగిన చర్చ అది.. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ దక్షిణాఫ్రికాలోని జొహెనస్బర్గ్ తో సమావేశమైంది. దేశానికి గౌరవం దక్కాలని దక్షిణాఫ్రికా గట్టిగా డిమాండ్ చేసింది. మిగతా సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. దాంతో అక్కడి వాతావరణం తీవ్రఉద్రిక్తతకు దారితీసింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఎంపీ చంపుతానంటూ ప్రత్యర్థి ఎంపీని బెదిరించడం కెమెరాకు చిక్కడం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చెక్ రిపబ్లిక్ సభలోనూ రసాభాస :
చెక్ రిపబ్లిక్ (CZECH REPUBLIC) పార్లమెంట్ దిగువ సభలో Covid-19పై జరిగిన చర్చ రసాభాసగా మారింది. ఛైర్మన్ స్థానానికి కనీస గౌరవం ఇవ్వని సభ్యులంతా వాగ్వాదానికి దిగారు. ఒకరి మాట ఒకరు వినకుండా మాటల యుద్ధానికి దిగారు. ఫలితంగా సభలో కార్యకలాపాలు రసాభాసగా మారాయి. తైవాన్ పార్లమెంట్లోనూ ఇదే రచ్చ కొనసాగింది. అమెరికా నుంచి మాంసం దిగుమతులపై నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సభలో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పంది మాంసాన్ని కూడా విసరి సభను అగౌరపరిచారు. మరోవైపు  చైర్మన్ మైక్రోఫోన్ లాగేసుకున్నారు. దూరంగా విసిరిపారేశారు.