Pegasus: స్పై వేర్‌ పెగాసస్ కోసం జనాల వెంపర్లాట..!

పెగాసస్.. ఇప్పుడు మన దేశంలో చాలా పాపులర్ అయింది ఈ పేరు. పార్లమెంటుకు కూడా కుదిపేస్తున్న ఈ పెగాసస్ అనేది నిజానికి ఓ సాఫ్ట్ వేర్ యాప్. ఇది మనం ఎవరి ఫోన్ అయితే టార్గెట్ చేసామో వారి ఫోన్ లోకి సులభంగా చొరబడి.. నిఘా పెడుతుంది.

Pegasus: స్పై వేర్‌ పెగాసస్ కోసం జనాల వెంపర్లాట..!

Pegasus

Pegasus: పెగాసస్.. ఇప్పుడు మన దేశంలో చాలా పాపులర్ అయింది ఈ పేరు. పార్లమెంటుకు కూడా కుదిపేస్తున్న ఈ పెగాసస్ అనేది నిజానికి ఓ సాఫ్ట్ వేర్ యాప్. ఇది మనం ఎవరి ఫోన్ అయితే టార్గెట్ చేసామో వారి ఫోన్ లోకి సులభంగా చొరబడి.. నిఘా పెడుతుంది. ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ లావాదేవీలు కేవలం సార్వభౌమత్వం కలిగిన రెండే దేశాల మధ్యనే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ప్రైవేటు వ్యక్తులు, సం‍స్థలకు ఈ సాఫ్ట్‌వేర్‌ యాక్సెస్‌ ఇవ్వలేదు.

అయితే.. జనాలకి మాత్రం ఈ యాప్ మీద క్రేజ్ పెరిగింది. సహజంగానే ఎదుటివారి ఫోన్ లో చొరబడి వారి అంతర్గత జీవితాలలోకి తొంగి చూడాలనుకునే మనస్తత్వం ఉన్న వారంతా ఈ యాప్ కోసం ప్లే స్టోర్ లాంటి వాటిలో తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారికి ప్లే స్టోర్ లోనే పెగాసస్ పేరుతో ఓ యాప్ కనిపించడంతో దాన్ని డౌన్ లోడ్ చేస్తున్నారు. అయితే.. ఇందులో ఎలాంటి స్ప్రె తరహా సెట్టింగ్స్ లేకపోగా కేవలం కేరళ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెటీరియల్ కనిపిస్తుంది.

దీంతో యాప్ లో స్ప్రె వివరాలేమీ లేకేపోవడంతో యాప్ లోని టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి యాప్ పనిచేయడం లేదని.. తాము టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్ లో వివరాలు ఎలా తెలుసుకోవాలో చెప్పాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే..నిజానికి స్ప్రె యాప్ పెగాసస్ వేరు.. ప్లే స్టోర్ లోని పెగాసస్ వేరు. స్ప్రె యాప్ పెగాసస్ ఇజ్రాయెల్ దేశంలో తయారైతే.. ఇప్పుడు అందరూ డౌన్ లోడ్ చేసుకుంటున్న పెగాసస్ కోజికోడ్‌లో పెగాసస్‌ పేరుతో ఉన్న సివిల్స్ కోచింగ్‌ సెంటర్‌ వారిది.

పెగాసస్ కోచింగ్ సెంటర్ వారి యాప్ ప్లే స్టోర్ లో నుండి డౌన్ లోడ్ చేసుకున్న వారు… అందులో స్ప్రె వివరాలు లేకపోవడంతో కోచింగ్ సెంటర్ కు ఫోన్ చేసి సతాయిస్తున్నారట. దీంతో ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు సోషల్ మీడియాతో పోస్టులు పెట్టడంతో పాటు మీడియా ముందుకొచ్చి.. మా యాప్ కు స్ప్రె యాప్ పెగాసస్ కు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంటున్నారు. మా కోచింగ్ సెంటర్ పేరుతోనే తాము చాలాకాలం క్రితమే ఈ యాప్ అందుబాటులో ఉందని.. ఇకపై స్ప్రె కోసం తమ యాప్ ఎవరూ డౌన్ లోడ్ చేసుకోవద్దని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇంతకీ అసలు.. ఈ జనాలకు ఎదుటి వారి ఫోన్ లో ఏముందో తెలుసుకొనే కుతూహలం ఎందుకో!