Star Sapphire Cluster : అదృష్టవంతుడు.. ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745కోట్ల విలువైన రత్నాల రాయి దొరికింది

అదృష్ట దేవత ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి పలకరించిందంటే మాత్రం జీవితమే మారిపోతుంది. పేదవాడు కూడా సంపన్నుడు అయిపోతాడు.

Star Sapphire Cluster : అదృష్టవంతుడు.. ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745కోట్ల విలువైన రత్నాల రాయి దొరికింది

Star Sapphire Cluster

Star Sapphire Cluster : అదృష్ట దేవత ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి పలకరించిందంటే మాత్రం జీవితమే మారిపోతుంది. పేదవాడు కూడా సంపన్నుడు అయిపోతాడు. అయితే ఇక్కడ అతడు పేదవాడేమీ కాదు.. బాగా డబ్బున్న వాడే. ఓ రత్నాల వ్యాపారి. ఆయన తన ఇంటి పెరట్లో బావి కోసం తవ్వుతుండగా అనుకోకుండా కోట్ల విలువైన నీలమణులు(రత్నాల రాయి) దొరికాయి. ఒక పెద్ద రాయిలో అనేక చిన్న చిన్న ఇంద్రనీలపు రాళ్లు ఉన్నాయి. దీన్ని నీలమణుల క్లస్టర్ (Sapphire cluster) అని పిలుస్తారు. ఈ నీలపు రాయి బరువు 510 కేజీలు (2.5 మిలియన్ కేరట్లు). ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన నీలమణుల్లో ఇదే అత్యంత పెద్దది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.745 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేశారు.

శ్రీలంకలో మణులు, రత్నాలు అధికంగా దొరికే ప్రాంతం రత్నపుర. ఇక్కడే ఓ రత్నాల వ్యాపారి ఇంటి పెరట్లో ఇది దొరికింది. దీనికి “అనుకోకుండా దొరికిన నీలమణి” (సెరెండిపిటీ సాఫైర్) అని పేరు పెట్టారు. “భూమి లోపల అరుదైన రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందని బావిని తవ్వుతున్న వ్యక్తి మమ్మల్ని అప్రమత్తం చేశారు. లోతుగా తవ్వుతుండగా ఈ నీలమణి బయటపడింది” అని వ్యాపారి తెలిపారు.

ఆ రాయి దొరికిన వెంటనే రత్నాల వ్యాపారి అధికారులకు తెలియజేశారు. ఆ రాళ్ల గుళ్లను శుభ్రం చేసి, దాని విలువను అంచనా వేసేందుకు ఏడాది సమయం పట్టింది. రత్నపురలో గతంలో అనేక విలువైన రత్నాలు, అరుదైన రాళ్లు బయటపడ్డాయి. ఇంద్రనీలాలు, ఇతర విలువైన రత్నాల ఎగుమతిలో శ్రీలంక ముందు వరుసలో ఉంటుంది. “ఇంత పెద్ద రత్నాల రాయిని నేనెప్పుడూ చూడలేదు. ఇది సుమారు 40 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుంది” అని ప్రఖ్యాత జెమ్మాలజిస్ట్ డాక్టర్ గామిని జోయిసా అన్నారు.

అదే సమయంలో.. ఈ రాయి అధిక క్యారెట్ విలువను కలిగి ఉన్నప్పటికీ, క్లస్టర్ లోపల ఉన్న అన్ని రాళ్ళు అధిక-నాణ్యత కలిగి ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా శ్రీలంక రత్న పరిశ్రమ నష్టాలను చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విలువైన రాయి.. ఇప్పుడు అంతర్జాతీయ కొనుగోలుదారులను, నిపుణులను ఆకర్షిస్తుందని రత్నాల తయారీ పరిశ్రమలో పని చేసే వారు ఆశించారు.

“ఇది ఒక ప్రత్యేకమైన స్టార్ నీలమణి నమూనా. బహుశా ప్రపంచంలోనే అతి పెద్దది. పరిమాణం, దాని విలువను బట్టి చూస్తే, ఇది ప్రైవేట్ వ్యక్తులు లేదా మ్యూజియంలు నిర్వహించే వారు కొనేందుకు ఆసక్తి చూపుతారని శ్రీలంక జాతీయ జెమ్, జువెలరీ అథారిటీ చైర్మన్ తిలక్ వీరసింగ్ అన్నారు.